
ఆటో బోల్తా – బాలుడి మృతి
ముదిగుబ్బ: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ మండలం సీసీరేవు గ్రామానికి చెందిన నందకిషోర్ (14) సెల్‌ఫోన్ రిపేరి కోసం తన స్నేహితులతో కలసి మంగళవారం ఆటోలో ముదిగుబ్బకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం వెళుతుండగా సిద్ధన్నగారిపల్లి వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన నందకిషోర్‌ను అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో
గంజాయి విక్రేతలు?
కదిరి అర్బన్: మండలంలోని కొండమనాయుని పాలెం గ్రామ సమీపంలో మంగళవారం గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గంజాయి తరలింపు వెనుక ఉన్నది ఎవరనే అంశంపై పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బాలుడి దుర్మరణం
కనగానపల్లి: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ బాలుడిని బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని పావగడ తాలూకా సోలేపల్లికి చెందిన రామాంజినేయులు మంగళవారం సాయంత్రం తన కుమారుడు వినయ్ (7)తో కలసి ద్విచక్ర వాహనంపై అనంతపురం నుంచి కనగానపల్లి మీదుగా వారి స్వగ్రామానికి బయలుదేరాడు. తల్లిమడుగుల వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న టిప్పర్ వాహనాన్ని డ్రైవర్ సడన్‌గా ఆపి రివర్స్ చేశాడు. టిప్పర్ వెనుకలే ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో కొడుకుతో పాటు రామాంజనేయులూ కిందపడ్డారు. బాలుడి తలపై టిప్పర్ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే చెందాడు. రామాంజనేయులు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సహజ కాలువలు
పునరుద్ధరించండి
● జలసాధన సమితి కార్యదర్శి గంగిరెడ్డి
హిందూపురం: హంద్రీ–నీవా కాలువ పనుల్లో భాగంగా పూడ్చి వేసిన సహజ కాలువలను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి చైతన్య గంగిరెడ్డి డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల మీదుగా మడకశిర నియోజకవర్గం అమరాపురం వరకూ హంద్రీ–నీవా కాలువ తవ్వేటప్పుడు వర్షపు నీరు చెరువులకు చేరవేసే సహజ కాలువలను పూడ్చి పనులు అరకొరగా చేశారని తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరద గట్లను తెంచుకుని హంద్రీ–నీవా కాలువలో చేరడం ద్వారా ఇసుక, మట్టి పేరుకుపోతోందన్నారు. సహజంగా చెరువులకు చేరాల్సిన నీరు కాస్త హంద్రీ–నీవా కాలువలోకి చేరుతోందన్నారు. ఫలితంగా చెరువులు నిండక ఆయకట్టు రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. సహజ కాలువలు పూడిపోకుండా హంద్రీ–నీవా కాలువలపై బ్రిడ్డిలు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. వెంటనే సహజ కాలువల్లో పూడిక తీసి వర్షం నీరు చెరువులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పనులు పూర్తి చేయడానికి అవసరమైన రూ.11 కోట్ల నిధుల కోసం హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల శాసనసభ్యులు కృషి చేయాలని విన్నవించారు.
సెలవులో జెడ్పీ సీఈఓ
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ) శివశంకర్ సెలవులో వెళ్లారు. 10 రోజుల సెలవు కావాలని ఆయన లెటర్ పెట్టగా.. వారం రోజులకు మాత్రమే కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత ఆయన సెలవు పొడిగించుకునే అవకాశం ఉంటుందని జెడ్పీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, గత సీఈఓ రామచంద్రారెడ్డి పట్టుమని మూడు నెలలు తిరక్కనే ఆయనను టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి బలవంతంగా సాగనంపిన సంగతి దుమారం రేపింది. తరువాత శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో డ్వామా ఏపీడీగా పని చేస్తున్న శివశంకర్‌ను జెడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన రాకను ఓ ద్వితీయ శ్రేణి అధికారి జీర్ణించుకోలేక లోలోన పొగబెడుతుండడంతో చివరకు సెలవులో వెళ్లాల్సి వచ్చిందని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ వస్తారో.. లేదో అనే విషయంపై చర్చ నడుస్తోంది.
బస్సు నుంచి కిందపడిన మహిళ
రాయదుర్గం టౌన్: బస్సును ఆపేందుకు కండెక్టర్ నిరాకరించడంతో కదులుతున్న ఆర్టీసీ బస్సు నుంచి కిందపడి ఓ మహిళ గాయపడింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కణేకల్లు రోడ్డులో ఉన్న ఎంఏసీ హౌసింగ్ లే అవుట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఎంసీఏ లేవుట్ వద్ద నివాసం ఉంటున్న భూలక్ష్మి మంగళవారం ఉదయం ఉరవకొండకు వెళ్లి తిరిగి రాత్రి 9 గంటలకు రాయదుర్గానికి ఆర్టీసీ బస్సులో వచ్చింది. ఆమె దిగాల్సిన స్టాప్ రావడంతో ఫుట్‌బోర్డు సమీపంలోకి చేరుకుని బస్సు నిలపాలని కండక్టర్‌ను కోరింది. ఇందుకు కండెక్టర్ నిరాకరించాడు. అప్పటికే బస్సు స్పీడ్ బ్రేకర్ల వద్దకు చేరుకోవడంతో డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. దీంతో బస్సు దిగేందుకు ప్రయత్నించిన ఆమె అదుపు తప్పి కిందపడింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను అదే బస్సులో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆటో బోల్తా – బాలుడి మృతి