
అంతర్ జిల్లా చైన్‌స్నాచర్ల అరెస్ట్
అనంతపురం: సులువుగా డబ్బు సంపాదించేందుకు బంగారు చైన్‌లను లాక్కొని ఉడాయిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం మూడో పట్టణ పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శాంతిలాల్ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడకు కంబం నాగార్జున అలియాస్ నాగార్జున రెడ్డి ఉరఫ్ చిన్నా, బోజనోల వరప్రసాద్ అలియాస్ ప్రసాదు ఇద్దరూ మంచి స్నేహితులు. బతుకు తెరువు కోసం నాగార్జున అనంతపురానికి వలస వచ్చి విజయనగర కాలనీలో నివాసముంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వరప్రసాద్ సైతం కదిరికి వలస వెళ్లి అక్కడి ఎరికల కాలనీలో నివాసముంటున్నాడు. నాగార్జునకు పేకాట, మద్యం సేవించడం, ఇతర చెడు వ్యసనాల కారణంగా అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో అప్పులు, వ్యసనాలు తీర్చుకునేందుకు చైన్‌స్నాచింగ్‌లకు పథకం రచించి, వరప్రసాద్‌ను అనంతపురానికి రప్పించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలసి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ వచ్చారు. ఈ ఏడాది జూన్ 21న నేషనల్ పార్క్ ఎదురుగా స్కూటీపై ఇద్దరు మహిళలను మోటార్ సైకిల్‌పై అనుసరిస్తూ స్కూటీ నడుపుతున్న ఆమెతో మాట కలిపి వెనుక చక్రంలో గాలి తగ్గిందని బుకాయించారు. వారి మాటలు నమ్మిన ఆమె స్కూటీని ఆపి వెనుక చక్రం వైపు తొంగి చూస్తుండగా మెడలోని బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో మంగళవారం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.4 లక్షల విలువ చేసే 23 గ్రాముల బరువు కలిగిన బంగారు చైను, 1.5 గ్రాముల బరువులున్న ఒక బంగారు తాళిబొట్టు, ఒక బంగారు లక్ష్మీకాసు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.
రూ.4 లక్షల విలువ చేసే
బంగారు నగలు స్వాధీనం