
కరెంట్‌తో ఆటలొద్దు
పుట్టపర్తి టౌన్: అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే రైతులు తమ పొలాల్లో వివిధ రకాల పంటసాగు చేపట్టారు. పంటలకు నీరు పెట్టడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ తీగలు, మోటార్ల వద్దనే గడుపుతున్నారు. ఈ క్రమంలో సాంకేతిక సమస్యలు ఏవైనా ఉత్పన్నమైతే తమకున్న పరిజ్ఞానం మేరకు మరమ్మతులకు ఉపక్రమిస్తుంటారు. ఇలాంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మృత్యువాత పడే ప్రమాదముంది. పొలాల్లో కర్ర స్తంభాలు, వేలాడుతున్న తీగల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం తప్పదని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్టార్టర్ పెట్టెలతో జాగ్రత్త
పొలాల్లో బోరుబావులకు సమీపంలోనే మోటార్ స్టార్టర్ పెట్టెలను రైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటిని బయలు ప్రదేశంలోనే ప్టాస్టిక్ కవర్లు కప్పి ఉంచేస్తున్నారు. వర్షం కురిసినా, బోరు బావుల నుంచి ఎగజిమ్మిన నీరు స్టార్టర్ పెట్టెలోకి చేరుకుంటోంది. పెట్టెలు తీగలు గజిబిజిగా ఉంటే ఏరికోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు స్టార్టర్ పెట్టెలకు సరైన భద్రత కల్పించాలి. విద్యుత్ తీగలు ఎండకు ఎండి పొడి బారిపోకుండా వాటికి రక్షణగా ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. పొడిబారిన విద్యుత్ తీగల వల్ల ఇన్సులేటర్ దెబ్బ తిని తీగలు బయటపడే ప్రమాదముంది. ఈ తీగలు స్టార్టర్ పెట్టెను తగులుకుని ఉండడంతో కరెంట్ ప్రసరించి ప్రమాదాలకు కారణమవుతుంది. మోటార్ ఆన్ చేసే ముందు ఒకసారి టెస్టర్ సాయంతో స్టార్టర్ పెట్టెను చెక్ చేసుకోవడం ద్వారా ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యుత్ తీగలతో ప్రమాదం
గాలీవానకు ఒక్కోసారి పొలాల్లో విద్యుత్ తీగలు తెగిపడుతుంటాయి. వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి చేరుకునే సమయంలో విద్యుత్ లైన్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలున్నా.. తెగి పడి ఉన్నా వెంటనే వాటికి దూరంగా వైదొలిగి పోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటిని చేతితో తాకరాదు. చోరీల భయంతో కొందరు రైతులు పంటకు నీరుపెట్టగానే విద్యుత్ వైర్లను ఇంటికి తీసుకెళుతుంటారు. మరుసటి రోజు మళ్లీ పొలానికి తీసుకెళ్లి స్టార్టర్ పెట్టకు అనుసంధానిస్తూ ఉంటారు. అనుసంధానించేందుకు ముందు తీగలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ఎక్కడైనా ఎలుకలు కొరికి ఉన్నట్లుగా ఉంటే వెంటనే ఇన్సులేటర్ టేప్ చుట్టాలి. వైర్ పాతబడితే వాటిని మార్చి కొత్త వాటిని అమర్చుకోవాలి. స్టార్టర్ పెట్టెకు పటిష్టమైన ఎర్త్ ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాల తీవ్రత తగ్గే అవకాశముంది.
వర్షాకాలంలో విద్యుత్ తీగలతో జాగ్రత్త
మోటార్ స్టార్టర్లతో పొంచి ఉన్న ప్రమాదం
నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణానికి ముప్పే
చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలకు చెక్
జాగ్రత్తలు పాటించాలి
వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లను తాకరాదు. పొలాల్లో స్టార్టర్లు మరమ్మతులకు గురైతే ఎలక్ట్రీషియన్‌తోనే రిపేరీ చేయించాలి. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్వయంగా ఫీజులు వేయడం లాంటి పనులు చేయరాదు. పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడితే వెంటనే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించాలి. విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
– సాయినాథ్‌గౌడ్, విద్యుత్ శాఖ ఏఈ, పుట్టపర్తి

కరెంట్‌తో ఆటలొద్దు