
రాష్ట్ర ఫుట్‌బాల్ చాంపియన్‌గా జిల్లా జట్టు
హిందూపురం టౌన్: విశాఖ వేదికగా రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్ర సీనియర్ పురుషుల ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ మేరకు జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు జేవీ అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లా జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించి ఫైనల్‌కు చేకుని విశాఖపట్నం జట్టుతో మంగళవారం తలపడిందన్నారు. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా కోచ్‌గా వ్యవహరించిన బీకే మహమ్మద్ సలీమ్, మేనేజర్ ఇర్షాద్ అలీ, జట్టు క్రీడాకారులను అభినందించారు.
హత్యాయత్నం కేసు నమోదు
కదిరి టౌన్: ఓ యువతిని ప్రేమించిన విషయంగా కక్ష పెంచుకుని కొందరు తనను చంపడానికి ప్రయత్నించారంటూ కదిరిలోని దేవాలం వీధికి చెందిన యువకుడు సాయికిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించిన విషయంలో కక్ష పెంచుకున్న శివ, పవన్, సాయికిరణ్, కళ్యాణ్ ఈ నెల 17న రాత్రి సాయికిషోర్‌ను అతని ఇంటి నుంచి బలవంతంగా మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కట్టెలతో దాడి చేసి, రాయి వేసి చంపే ప్రయత్నం చేయడంతో చుట్టుపక్కల వారు అడ్డుకుని కాపాడారు. గాయపడిన సాయికిషోర్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుల్లో శివ, పవన్‌తో పాటు ఒకరు కదిరి పీఎస్‌లో 7 కేసుల్లో , మరొకరు 6 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై రౌడీషీట్ తెరిచినట్లు పోలీసులు తెలిపారు.
వేధింపులపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ వివాహిత చేసిన ఫిర్యాదు మేరకు అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ధర్మవరంలోని సుందరయ్యనగర్‌కు చెందిన తుంగా రేఖకు కొత్తపేటకు చెందిన పట్టు చీరల వ్యాపారి రంగం ఆంజనేయులుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో 14తులాల బంగారాన్ని రేఖ తల్లిదండ్రులు ఇచ్చారు. వీరికి సంతానం లేదు. పెళ్లి అయిన మూడు నెలల వరకూ వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత ఆంజనేయులు చెడు వ్యసనాలకు బానిస కావడంతో పాటు భార్య బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆన్‌లైన్ బెట్టింగ్‌ల్లో నష్టపోయాడు. ఈ విషయాన్ని తన అత్త, మామకు చెప్పినా వారు ఆంజనేయులుకే వత్తాసు పలికారు. దీంతో విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద చెప్పుకుని రేఖ బాధపడింది. ఆ సమయంలో పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పారు. అయినా ఆంజనేయులులో మార్పు రాలేదు. రెండేళ్లుగా అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త, మామ తరచూ రేఖను వేధిస్తుండడంతో తాళలేక ఆమె పుట్టింటికి చేరుకుంది. అయినా డబ్బు కావాలని వేధిస్తుండడంతో భరించలేక రేఖ చేసిన ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, అత్త లక్ష్మీదేవి, మామ రామచంద్రపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.