
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
గోరంట్ల: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కేంద్రియ విద్యాలయ అధికారులకు సూచించారు. మండల పరిధిలోని పాలసముద్రం వద్ద గల ‘నాసిన్’ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయలో మంగళవారం విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఈ విద్యాసంవత్సరానికి కేటాయించిన బడ్జెట్, సిబ్బంది జీతాలు, స్కూల్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, విద్యాలయలో జరిగిన అడ్మిషన్లు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2వ తేదీలోపు పేరెంట్స్, టీచర్స్ మీట్‌ను నిర్వహించాలన్నారు. సిలబస్, టైంటేబుల్, విద్యార్థుల సామర్థ్యాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలన్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలిపి అధిగమించేందుకు తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలన్నారు. తరచూ పేరెంట్స్, టీచర్స్ మీట్‌లు నిర్వహించడం వల్ల విద్యార్థుల పఠన సామర్థ్యం, లోపాలు, మెరుగుదల మార్గాల గురించి తల్లిదండ్రులతో చర్చించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఉపాధ్యాయుడూ కృషి చేయాలన్నారు. సృజనాత్మాక పద్ధతుల ద్వారా బోధన చేస్తే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందన్నారు. ప్రతి విద్యార్థి ప్రగతిపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. విద్యాలయ శాశ్వత భవన నిర్మాణం, సిబ్బంది నియామకానికి సంబంధించిన ఫైలును కేంద్రీ విద్యాలయ సంఘటన్ కమిషనర్‌కు పంపిస్తామన్నారు. అసెంబ్లీ నిర్వహించే ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్ వేయాలని, విద్యార్థులు వేచి ఉండటానికి బస్‌షెల్టర్, స్పీడ్ బ్రేకర్లు, క్రీడామైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో కేంద్రీయ విద్యాలయ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులతో పాటు ‘నాసిన్’ డిప్యూటీ డైరెక్టర్ శేషు, విద్యాలయ ప్రిన్సిపల్ కృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్రియ విద్యాలయ అధికారులకు
కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం