
13 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకూ 13 మండలాల పరిధిలో 33.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా అమరాపురం మండలంలో 6.6 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. ఇక కొత్తచెరువు మండలంలో 4.4 మి.మీ, పుట్టపర్తి 4.2, మడకశిర 2.6, హిందూపురం 2.2, కదిరి 2, పెనుకొండ 2.0, లేపాక్షి 2.0, ధర్మవరం 1.8, నల్లమాడ 1.8, సోమందేపల్లి 1.6, గాండ్లపెంట 1, బుక్కపట్నం మండలంలో 1.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జడివానతో రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి. ముఖ్యంగా బత్తలపల్లి సమీపంలోని గంటలమారెమ్మ కనుమ వద్ద రెండు నెలలుగా ఎన్‌హెచ్–342 పనులు సాగుతుండటంతో ఆ రోడ్డు అధ్వానంగా మారింది. అసలే గుంతలమయమైన రోడ్డు తాజా వర్షంతో చిత్తడిగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నూర్ మహమ్మద్‌ను
కస్టడీకి ఇవ్వండి
● కోర్టులో పిటీషన్ వేసిన పోలీసులు!
● ‘ఉగ్ర’ వాట్సాప్ గ్రూపుల్లో చాట్ చేసిన మరో ఇద్దరు గుర్తింపు
ధర్మవరం: ఉగ్రవాదులతో సంబంధమున్న నూర్ మహమ్మద్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తున్న ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌ను నాలుగురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నూర్ మహమ్మద్‌కు సంబంధం ఉన్న ఉగ్రవాదులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నూర్ మహమ్మద్‌తోపాటు ఉగ్రవాదుల వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేస్తున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరిని పోలీసులు గుర్తించడంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిద్దరిని అరెస్టు చేసి ధర్మవరానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటపడే అవకాశాలున్నాయి.
‘ఓపెన్’ అడ్మిషన్ల గడువు పొడిగింపు
పుట్టపర్తి: ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ అడ్మిషన్ల (2025–2026 విద్యా సంవత్సరానికి) గడువు పొడిగించినట్టు డీఈఓ జి.కిష్టప్ప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకూ రూ.200 అపరాధ రుసుంతో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. పదో తరగతిలో చేరేందుకు 14 ఏళ్లు, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 15 ఏళ్లు నిండి ఉండాలన్నారు. వివరాలకు www.apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని ఏఐ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.
జాతీయ రహదారిపై ఘర్షణ
● ఐదుగురికి గాయాలు
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... బుక్కపట్నంకు చెందిన సుబ్రహ్మణ్యం, నవీన్ సుధీర్‌కుమార్, మహేష్, బెల్లం కృష్ణ మంగళవారం ఉదయం కారులో నసనకోటకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామం వెళ్తుండగా... చెన్నేకొత్తపల్లి దాటగానే జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వారు వాహనాన్ని అడ్డగించారు. అకారణం దాడి చేసి సుబ్రహ్మణ్యం, నవీన్ సుధీర్‌కుమార్, మహేష్, బెల్లం కృష్ణను గాయపరిచారు. స్థానికులు వారిని చెన్నేకొత్తపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

13 మండలాల్లో వర్షం