పేదల నెత్తిన గుదిబండ
ప్రశాంతి నిలయం: జిల్లా వాసులపై వంట గ్యాస్ రూపంలో అదనపు భారం పడింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానికి అంటుతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 ధర పెంచి కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపని పాలకులు.. నిత్యావసర సరుకుల ధరలు, వంట గ్యాస్, ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల పరిధిలో ఐఓసీ, హెచ్‌పీసీ, బీపీసీ కంపెనీల ద్వారా 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా వ్యాప్తంగా సాధారణ గృహ వినియోగ సిలిండర్లు 8,08,489 ఉన్నాయి. మరో 7,737 నాన్ డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి.
ఏటా రూ.24.25 కోట్ల భారం..
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 అదనంగా పెంచడంతో జిల్లా వాసులపై ఏటా రూ.24.25 కోట్ల భారం పడనుంది. జిల్లాలో 8,08489 గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కో కనెక్షన్ ద్వారా ఏడాదికి 6 సిలిండర్లు చొప్పున 48,50,934 సిలిండర్లు వినియోగిస్తున్నారు. గతంలో 14.20 కిలోల సిలిండర్ ధర జిల్లా కేంద్రంలో రూ.870 ఉండగా పెంచిన తర్వాత రూ.930కి చేరింది. రవాణా చార్జీల రూపంలో దూరాన్ని బట్టి మరో రూ.30 నుంచి రూ.50ను, డెలివరీ చేసినందుకు అంటూ బాయ్స్ మరో రూ.20 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గృహ వినియోగదారులు సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.1000 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
ధర తగ్గించాలి
కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను ఏ మాత్రం నెరవేర్చడం లేదు. పైగా నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోవడం లేదు. నెలసరి ఖర్చుల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడేమో గ్యాస్ సిలిండర్‌పై రూ.50 ధర పెంచడం తగదు. వెంటనే పెంచిన సిలిండర్ రేటును వెంటనే తగ్గించాలి. – సాయిలీల, ప్రశాంతి గ్రామ్
పేదలపై భారం
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కొనుగోలు శక్తి లేక చాలా మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందనే సాకు చూపి వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచడం సబబు కాదు. పెంచిన ధరను వెంటనే తగ్గించి పేదలకు న్యాయం చేయాలి. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ ప్రభుత్వానికై నా పతనం తప్పదు. – కవిత, గోకులం, పుట్టపర్తి
ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌పై
అదనంగా రూ.50 పెంపు
జిల్లా వినియోగదారులపై ఏటా రూ.24.25 కోట్ల అదనపు భారం
పేదల నెత్తిన గుదిబండ
పేదల నెత్తిన గుదిబండ


