నేడు గోరంట్లకు ఆర్థిక మంత్రుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు గోరంట్లకు ఆర్థిక మంత్రుల రాక

Published Thu, Nov 30 2023 12:44 AM | Last Updated on Thu, Nov 30 2023 12:44 AM

- - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ‘వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గురువారం గోరంట్లకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాట్లపై కలెక్టర్‌ అరుణ్‌బాబు సమీక్షించారు. 17 సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా పథకాలకు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఛాయా చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయా పథకాల లబ్ధిదారులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల ముఖాముఖికి ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ భాగ్యరేఖ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, డీఎంహెచ్‌ఓ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీసీహెచ్‌ఎస్‌ తిప్పేంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ

స్నాతకోత్సవ నోటిఫికేషన్‌

జనవరి మొదటి వారంలో

స్నాతకోత్సవం

అనంతపురం: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం– అనంతపురం (జేఎన్‌టీయూఏ) 13వ స్నాతకోత్సవం వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నారు. స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌, యూనివర్సిటీల చాన్సలర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అనుమతి లభించడంతో అధికారులు బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంటెక్‌, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు స్నాతకోత్సవ పట్టాకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ.2 వేలు చెల్లించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక హార్డ్‌ కాపీలు యూనివర్సిటీకి పంపాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు www.jntua.ac.in లో పరీక్షల విభాగం కింద తెలుసుకోవచ్చు.

ఇళ్ల నిర్మాణంలో

పురోగతి సాధించాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

పుట్టపర్తి అర్బన్‌: ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల్లో ఎప్పటికప్పుడు పురోగతి సాధించాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో రెండో విడత ఇళ్ల నిర్మాణాల పురోగతిపై స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగనన్న కాలనీల్లో చేపట్టిన పనులను శరవేగంగా పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2024 జనవరి 30వ తేదీ వరకూ ప్రత్యేకంగా ‘మెగా కంప్లీషన్‌ డ్రైవ్‌’ నిర్వహించి ఇప్పటికే ప్రారంభించిన 20,965 ఇళ్ల నిర్మాణాలను పూర్తయ్యేలా చూడాలన్నారు. అలాగే ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల్లో అర్హులందరూ పాల్గొనేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎంపీడీఓలు కీలక పాత్ర పోషించాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ నరసయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ రషీద్‌ఖాన్‌, మైన్స్‌ అండ్‌ జియాలజీ డీడీ రామమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయం ప్యాసింజర్‌ సేవలు పొడిగింపు

గుంతకల్లు: మంత్రాలయం ప్యాసింజర్‌ సేవలను రానున్న జనవరి ఒకటో తేదీ వరకు పొడిగించినట్లు రైల్వే డివిజనల్‌ అధికారులు తెలిపారు. నేటితో (30వ తేదీతో) గుంతకల్లు–మంత్రాలయం (07411) డైలీ ప్యాసింజర్‌ గడువు ముగుస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రైలును డిసెంబర్‌ 31 వరకు పొడిగించారు. అదేవిధంగా మంత్రాలయం–గుంతకల్లు (07412) డైలీ ప్యాసింజర్‌ను జనవరి 1 వరకు పొడిగించినట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు
1/2

ఏర్పాట్లపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు
2/2

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

Advertisement
Advertisement
Advertisement