
గంటాపురంలో ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలిస్తున్న విదేశీ శాస్త్రవేత్తలు
బత్తలపల్లి/కనగానపల్లి: ప్రకృతి సేద్యానికి ఉమ్మడి అనంతపురం జిల్లా వాతావరణం అనుకూలంగా ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం అభిప్రాయ పడింది. లావోస్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, ట్యూనిషీయా, పెరూ వంటి దేశాలకు చెందిన 60 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం రెండోరోజు మంగళవారం రైతు సాధికార సంస్థ వైస్ చైర్మెన్ విజయ్‌కుమార్, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్ తదితరులతో కలిసి బత్తలపల్లి, కనగానపల్లి మండలాల్లో పర్యటించింది. తొలుత బత్తలపల్లి మండలం గంటాపురంలో పర్యటించిన శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సాగు చేస్తున్న పంటలు, దిగుబడులు, అంతర పంటలు, ఆదాయ మార్గాలపై స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బత్తలపల్లిలోని భారతి మండల సమాఖ్య భవనంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం–స్వయం సహాయక సంఘాల పాత్ర’పై మండల సమాఖ్య సభ్యులతో చర్చించారు. అనంతరం శాస్త్రవేత్తలు కనగానపల్లి మండలంలోని పర్వతదేవరపల్లిలో పర్యటించారు. గ్రామంలో ఏటీఎం పద్ధతిలో పంటలు సాగుచేస్తున్న రైతులు సునీత, నాగేశ్వరరెడ్డి, ఆనందరెడ్డి పొలాలను పరిశీలించారు. పంటల సాగు కోసం రైతులు సొంతంగా తయారు చేసుకుంటున్న సేంద్రీయ ఎరువులు, కషాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పొందుతున్న లబ్ధి, ప్రజల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలను గురించి తెలుసుకున్నారు.
అంతర్జాతీయ వ్యవసాయ
శాస్త్రవేత్తల బృందం
రెండోరోజు బత్తలపల్లి, కనగానపల్లి మండలాల్లో పర్యటన