
సమీక్షలో పాల్గొన్న జేసీ చేతన్, అధికారులు
పుట్టపర్తి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకూ జిల్లాలో కుల గణన చేపట్టనున్నట్లు జాయింట్ కలెక్టర్ చేతన్ తెలిపారు. మంగళవారం ఆయన, కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కులగణన, వికసిత్ భారత్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అంతకుముందు ఆయా అంశాలపై విజయవాడ నుంచి ప్రిన్సిపాల్ సెక్రెటరీ గిరిజా శంకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ.. కులగణన కార్యక్రమానికి తహసీల్దార్లు మండల నోడల్ ఆఫీసర్లుగా ఉంటారన్నారు. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ సమాచారం తెలియజేయాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కులగణన చేస్తారన్నారు. ఇంటింటి సర్వేను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే నవంబర్ 15 నుంచి జనవరి 26వ తేదీ వరకూ ‘వికసిత్ భారత్’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇందులో కేంద్రం అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కలిగిన లబ్ధిని, లబ్ధిదారుల వివరాలను గ్రామ సభల ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌రాం, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలాజ్యోతి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.