అమ్మ.. నాన్న.. ఓ చిన్నారి | Sakshi
Sakshi News home page

పిల్లల దత్తత కోసం పలువురు క్యూ

Published Mon, Aug 7 2023 12:36 AM

అనంతపురంలో కొన్ని నెలల క్రితం అమెరికా దంపతులు దత్తత తీసుకున్న చిన్నారి - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పిల్లలు లేని దంపతులకు ఆ లోటు ఉండకూడనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ దత్తత ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశు గృహాలను ఏర్పాటు చేసింది. అనాథలు, ఆదరణకు నోచుకోని పిల్లలను శిశుగృహలో సంరక్షిస్తుంటారు.

పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆ లోటును పూడ్చేందుకు, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీడీఎస్‌ పని చేస్తోంది. 15 ఏళ్లలోపు బాలబాలికలు దత్తతకు అర్హులు. దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు వారి అర్హత ఆధారంగా పిల్లలను ఇస్తారు.

దత్తత కోసం దరఖాస్తుల వెల్లువ
రాష్ట్రంలో చిన్నారులను దత్తత చేసుకోవాలని వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా విశాఖ, ఆ తర్వాతి స్థానం ఉమ్మడి అనంతపురం జిల్లాదే. గడిచిన ఏడాది 172 మంది దంపతులు చిన్నారుల కోసం దత్తతకు వచ్చారు. వీరిలో 21 మందికి మాత్రమే దత్తత అవకాశం దక్కింది. మిగతా 151 దరఖాస్తులు వెయిటింగ్‌లో ఉన్నాయి. అనంతపురం జిల్లాకు వచ్చిన దరఖాస్తుల్లో ఇతర దేశాల వారూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,184 దరఖాస్తులు వెయిటింగ్‌లో ఉండగా అందులో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 151 ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి
ఒక చిన్నారిని దత్తత చేసుకోవాలంటే వివిధ దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం www.cara.nic.in వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును పైన పేర్కొన్న వెబ్‌సైట్‌కు రూ.6వేలు డీడీ సమర్పించి అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం దత్తత ఏజెన్సీ వారు అధ్యయనం చేసి నివేదికను వెబ్‌సైట్‌లో పెడతారు. దత్తతకు దరఖాస్తు చేసుకున్న వారి మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ సమాచారం మేరకు 48 గంటల్లో బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవచ్చు.

రిజర్వు చేసుకున్న బిడ్డను నచ్చిందని ఆమోదం తెలియజేసి, రూ.40 వేలు డీడీ సమర్పించి బిడ్డను పొందాలి. బిడ్డను పొందిన వారం రోజుల్లో పాన్‌కార్డు, ఆదాయ ధ్రువపత్రం, వయసు ధ్రువీకరణ, దంపతుల ఫొటో, నివాస ధ్రువపత్రం, వివాహ ధ్రువపత్రం, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు ఏజెన్సీకి ఇవ్వాలి. బిడ్డను పొందిన వారం రోజుల్లో ఈ ధ్రువపత్రాలన్నీ స్థానిక కుటుంబ న్యాయస్థానం/జిల్లా మెజిస్ట్రేట్‌ కార్యాలయంలో సమర్పిస్తే ఉత్తర్వులిస్తారు. బిడ్డను దత్తత తీసుకున్నాక దత్తత ఇచ్చిన సంస్థకు సంబంధించిన సోషల్‌ వర్కర్‌ బిడ్డ యోగ క్షేమాల పరిశీలన రెండేళ్లపాటు చూస్తారు. ఈ సమయంలో 4 దఫాలు ఒక్కోసారి రూ.2వేల చొప్పున దత్తత తీసుకున్న దంపతులు డీడీ రూపంలో సొమ్ము చెల్లించాలి.

నిబంధనల ప్రకారం దత్తత
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని దత్తత సంస్థ సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) నిబంధనల మేరకు దత్తతకు వచ్చే దంపతుల పూర్వాపరాలను పరిశీలించాకే దత్తత ఇస్తున్నాం. ఈ ఏడాది ముగ్గురి దత్తత ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం అనంతపురం శిశు గృహలో ఐదుగురు చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు.
–శ్రీదేవి, ప్రాజెక్టు డైరెక్టర్‌, ఐసీడీఎస్‌

Advertisement
 
Advertisement
 
Advertisement