వంజివాక చెరువులో మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

వంజివాక చెరువులో మట్టి తవ్వకాలు

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

● అడ్డుకున్న గ్రామస్తులు

కోట: వంజివాక చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. కొందరు జేసీబీ, ట్రాక్టర్లను తీసుకుని మట్టిని తరలిస్తుండగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. తవ్వకాలు జరపకూడదని చెప్పడంతో వివాదం నెలకొంది. అయితే అక్రమాలకు పాల్పడుతున్న వారు దురుసుగా ప్రవర్తించినట్లుగా స్థానికులు తెలిపారు. కొందరు యువకులు రెవెన్యూ. ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వివాదం ముదురుతుండడంతో తవ్వకాలను నిలిపివేసి ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించారు. తవ్వకాల వెనుక కొందరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంజివాక చెరువుపై కొందరు నేతల కన్ను పడిందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే యంత్రాలతో తవ్వేందుకు సిద్ధమైనట్లు తెలిపారు.

నేటి నుంచి ‘సేవాసేతు అభియాన్‌’ క్యాంప్‌లు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఏపీఎస్పీడీసీఎల్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం నుంచి 9వ తేదీ వరకు మూడురోజులపాటు జిల్లా సర్కిల్‌ పరిధిలో పీఎం సూర్యఘర్‌పై (ఉచిత సోలార్‌ విద్యుత్‌) ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సేవాసేతు అభియాన్‌’ నిర్వహిస్తామని జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ సుధాకర్‌ అన్నారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పథకానికి దరఖాస్తు విధానం, సబ్సిడీ, సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్‌ సిబ్బందితోపాటు బ్యాంకర్లు, సాలార్‌ వెండర్స్‌ పాల్గొని వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. సోలార్‌ విద్యుత్‌ పథకం, సేవాసేతు కార్యక్రమాలపై సందేహాలుంటే 1912 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

కండలేరులో 17 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 17 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 133, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 7 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.125

సన్నవి : రూ.60

పండ్లు : రూ.30

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement