ఎన్నికల డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల డ్రామాలు

Oct 2 2026 12:16 AM | Updated on Oct 2 2026 12:16 AM

సాక్షిప్రతినిధి, నెల్లూరు: బీసీలంటే.. బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాటుతూ ఆ వర్గాలకు రాజ్యాధికారంలో పట్టాభిషేకం చేస్తే.. కపట చంద్రబాబు.. బీసీ నాటకంతో మరోసారి వెన్నుపోటు పొడిచిన తీరుపై జిల్లాలోని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. ఆది నుంచి బీసీలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటున్న చంద్రబాబు పదవుల కల్పనలో మాత్రం ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాకు చెందిన బీసీ నేత పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు మంత్రివర్గంలో పట్టం కడితే.. మరో బీసీ నేత బీద మస్తాన్‌రావును రాజ్యసభకు పంపించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని బీసీ సామాజిక వర్గాలు విస్పష్టం చేశాయి. ఇంకో బీసీ నేత కొండూరు అనిల్‌బాబును ఆఫ్కాఫ్‌ చైర్మన్‌ను, మరో బీసీ మహిళ పొట్టేళ్ల శిరీషను జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్‌పర్సన్‌గా చేసిన చిత్తశుద్ధి వైఎస్‌ జగన్‌దేనని స్పష్టం చేస్తున్నారు. తాజాగా ముగిసిన జెడ్పీ పాలక వర్గంలో సైతం మరో ఇద్దరు మహిళలను జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్లుగా పట్టం కట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని ఆ సామాజిక వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఇక పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పదవుల్లోనూ బీసీలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర వైఎస్సార్‌సీపీదేనని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని 136 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లుగా పదవులు ఇచ్చారు.

బాబు పాలనలో బీసీలకు ప్రాధాన్యత ఏదీ?

చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో బీసీలకు ఏనాడు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన, పదవులు కల్పించిన దాఖాల్లేవని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చుపెట్టడం, లబ్ధి పొందడం తప్పించి.. ఏనాడు వారికి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించలేదని బీసీలు మండిపడుతున్నాయి. ఆయా కుల వృత్తిదారులకు ఆదరణ పథకం పేరుతో నాయీ బ్రాహ్మణులు, రజకులు, విశ్వబ్రాహ్మణులు, చేనేత కార్మికులు, వడ్డెర, గీత కార్మికులు, ఇతర వెనుకబడిన తరగతుల కుల వృత్తులకు సంబంధించి అవసరమైన పనిముట్లను అందజేసి.. కులవృత్తికే పరిమితం చేశారు.

జిల్లాలో 50 శాతం బీసీ జనాభానే..

జిల్లాను పునర్విభజన చేసిన తర్వాత సుమారు 24 లక్షల జనాభా ఉంది. అందులో 12 లక్షల మంది బీసీ జనాభా ఉన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంటే జిల్లాలో 4 లక్షల కుటుంబాలకు నేరుగా లాభం జరిగేది. ఇప్పుడు జీఓ కొట్టివేయడంతో పాత చట్టబద్ధత ప్రకారం 20 శాతం మాత్రమే అమలు జరుగుతుంది. బీసీ వర్గాల ఓట్లన్ని గంపగుత్తగా పొందాలని చంద్రబాబు ఆడిన డ్రామా ఇప్పుడు బెడిసి కొట్టింది.

రాష్ట్రంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పి స్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓలను హైకోర్టు గురువారం కొట్టివేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపట నాటకం మరోసారి బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లు సంపాదించేందుకు ప్రభుత్వం జీఓ ఇచ్చిందే తప్ప.. చట్టబద్ధత లేదని స్పష్టమైంది. రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన పరిమితులు, సుప్రీం కోర్టు తీర్పులను పట్టించుకోకుండా నేరుగా జీఓ జారీ చేయడంతోనే బీసీలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమైంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిధి దాటి రిజర్వేషన్లు కల్పించాలంటే ముందుగా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని, అయినా జీఓల పేరుతో బీసీలను పక్కాగా కావాలనే మోసం చేసిందని ఆయా సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. ఇది తెలిసీ, న్యాయపరంగా ఈ జీఓలు వీగిపోతాయని తెలిసి కూడా చంద్రబాబు చట్టానికి విరుద్ధంగా జీఓలు జారీ చేశారంటూ మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement