నెల్లూరు(అర్బన్): మూడు దశాబ్దాల క్రితం వరకు సమాజంలో గుండెపోటు కేసులు తక్కువగా నమోదయ్యేవి. 60 ఏళ్లు దాటిన వారిలోనే అక్కడక్కడా గుండెపోటు సంభవించేది. ప్రస్తుతం 20 నుంచి 30 ఏళ్లలోపు యువత కూడా హార్ట్ స్ట్రోక్‌కు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29వ తేదీని వరల్డ్ హార్ట్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం గుండెను కాపాడుకుందాం అంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జీవనశైలి మార్పుతో..
గతానికి భిన్నంగా మారిన జీవనశైలే ప్రస్తుతం గుండెకు ప్రధాన శత్రువుగా మారింది. జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న వయసులోనే రక్తనాళాలు కుచించుకుపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో గుండైపె భారం పెరుగుతోంది.
ఆందోళనకరంగా..
జిల్లాలో గతంతో పోలిస్తే గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐఎంఏ వైద్యులు పేర్కొంటున్నారు. శీతాకాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా తర్వాత కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, యువత, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు రావడం కలవరపరుస్తోంది. గతంలో వింజమూరు మండల కేంద్రంలో ఓ హైస్కూల్ విద్యార్థి తరగతి గదిలోనే హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. మరోచోట 20 ఏళ్ల యువతి చనిపోయింది. జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది ప్రజలు ఏదో ఒక రకమైన జబ్బుతో బాధపడుతున్నట్లు అంచనా. రోజూ సుమారు 1,200 మంది గుండె సంబంధిత సమస్యలతో జిల్లాలోని వైద్యులను సంప్రదిస్తున్నారు.
ముందు హెచ్చరికలు
ఛాతి మధ్యలో బరువుగా, పిండేసినట్లు నొప్పి రావడం, అది ఎడమ భుజం నుంచి చేతికి, మెడకు, దవడకు పాకడం. కొందరిలో విపరీతంగా చెమటలు పట్టడం, వికారం, తలతిరగడం. కొద్దిగా నడిచినా ఆయాసం, గుండెదడ రావడం. అకారణంగా అలసట, రాత్రిపూట దగ్గు వంటి లక్షణాలు కనిపించడం. ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సమీప వైద్యుడిని సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
జిల్లాలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు
సుమారు 3.5 లక్షల మంది
బాధితులు
మారిన జీవనశైలే ప్రధాన కారణం
వరల్డ్ హార్ట్ డే రేపు
ఆరోగ్యంగా ఉండాలంటే..
అధిక ఉప్పు, నూనె, మైదా, చక్కెరను తగ్గించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు, మొలకలు, గింజలు, చేపలను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. రెడ్‌మీట్‌ను తగ్గించాలి. రోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాలు వేగంగా నడవాలి. యోగా, ప్రాణాయామం చేయాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. పొగతాగడం, మద్యం సేవించడం మానేయాలి. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్), ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. యువత జిమ్‌లో అతిగా శ్రమించడం, స్టెరాయిడ్లు వాడటం, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, రాత్రంతా ఫోన్ చూడటం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఫిట్‌నెస్ పేరుతో గుండైపె అనవసరమైన ఒత్తిడి పెంచుకోకూడదు. గుండె నొప్పిని గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. గుండెపోటు వచ్చిన సందర్భంలో వీలైనంత త్వరగా వైద్య చికిత్స అందించడం కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.
అవగాహన, అప్రమత్తతతో గుండె జబ్బులకు చెక్
మారిన జీవనశైలి నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. గుండె జబ్బులపై ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. రాత్రి వేళ భోజనాన్ని ముందుగానే పూర్తి చేసుకునేలా ప్రణాళిక చేసుకోవాలి. ఛాతిలో నొప్పి, మంట, ఆయాసం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలి. గుండె సంబంధిత సమస్య ఉన్నా కంగారుపడాల్సిన అవసరం లేదు. సకాలంలో చికిత్స అందిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
– డాక్టర్ కె.నాగేంద్రప్రసాద్, గుండెవ్యాధుల నిపుణుడు, ఎనెల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి


