● ప్రాజెక్ట్ చైర్మన్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి
● వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సోమశిల దక్షిణ కాలువ పనుల్లో రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్ నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యుడైన సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరిని వెంటనే తొలగించి ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లీలామోహన్ డిమాండ్ చేశారు. నెల్లూరు సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను స్వాహా చేసినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేశవ చౌదరిని విధుల నుంచి తొలగించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు విడుదల చేస్తున్న నిధులను వినియోగించాల్సిన అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గోల్‌మాల్ చేయడంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గంలోని కాలువల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లాలోని పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో కాలువల పరిస్థితి దారుణంగా ఉందని, వాటి అభివృద్ధికి, మరమ్మతులకు కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విచారణ చేసేందుకు విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్న సమాచారం అందుకున్న సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవచౌదరి, ఆయన స్వగ్రామమైన నాగులవెళ్లటూరులో జేసీబీలతో కాలువ పనులు చేస్తున్నట్లు హడావుడి చేయడం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు షాన్‌వాజ్, సుబ్రహ్మణ్యం, జనార్దన్, పమజుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


