తగ్గుతున్న దిగుబడి | - | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న దిగుబడి

Sep 27 2026 11:54 PM | Updated on Sep 27 2026 11:54 PM

నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్న రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. తమను ఎవరడుగుతారనే ధీమాతో ఇక్కడ వెలువడే వ్యర్థాలను కాలువల్లోకి యథేచ్ఛగా వదులుతున్నారు. ఫలితంగా నీరు కలుషితమై దుర్గంధం వెదజల్లుతుండటంతో పాటు భూములు చౌడుగా మారుతున్నాయి. ఇంత అపార నష్టం సంభవిస్తున్నా, చేష్టలుడిగి చూడటం కాలుష్య నియంత్రణ మండలి వంతవుతోంది. పరిస్థితి ఇదే తరహాలో కొనసాగితే రానున్న రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొడవలూరు: మండలంలో రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. ప్రధాన వరద నీటి కాలువలైన మలిదేవి, పైడేరు వెంటే వీటిని నెలకొల్పారు. అయితే ఇక్కడ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ.. వ్యర్థాలతో కూడిన దుర్గంధభరిత నీటిని కెనాల్స్‌లోకి వదిలేస్తున్నారు. ఫలితంగా పంట దిగుబడి తగ్గుతుండటంతో పాటు నేల చౌడుబారుతోంది. ఈ జలాలను తాగిన పశువులు, గొర్రెలు ఈసుకుపోయి పిల్లలు పుట్టడంలేదు. దుర్వాసనతో సమీప గ్రామాల వారు నరకయాతనను అనుభవిస్తున్నారు.

800 ఎకరాల ఆయకట్టు

కొడవలూరు మండలంలో మలిదేవి, పైడేరు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఇవి హైవేను దాటి సముద్ర తీరం వరకు పారుతాయి. మలిదేవి కాలువ నీటిని రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంట గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల్లో సాగుకు వినియోగిస్తారు. సమీప గ్రామాల వారు తమ పశువులు, గొర్రెలను కాలువ సమీపంలోని పొలాల్లో మేపుతారు. పైడేరు కాలువలోని నీటిని అల్లూరు మండలం నార్తుమోపూరులో 300 ఎకరాల ఆయకట్టుకు వినియోగిస్తారు.

ఐదు ప్లాంట్లు

నార్తురాజుపాళెం అభివృద్ధి చెందిన గ్రామం కావడం, ఇక్కడికి సమీపంలోనే మలిదేవి కాలువ ఉండటంతో ఐదు రొయ్యల ప్రాసెసింగ్‌ ప్లాంట్లు వెలిశాయి. ఇందులో రొయ్యలను నీటితో శుభ్రపర్చి ఎగుమతి చేస్తుంటారు. ఆపై వచ్చే వ్యర్థాలతో కూడిన దుర్గంధభరితమైన నీటిని తిరిగి కాలువలోకే వదిలేస్తున్నారు. పైడేరు కాలువ పక్కనే గండవరం, పెయ్యలపాళెం మధ్య ఒక ఫ్యాక్టరీని నిర్మించారు. ఇక్కడ సైతం ఇదే సమస్య నెలకొంది.

నియంత్రణ చర్యలేవీ..?

ఫ్యాక్టరీల ద్వారా వచ్చే కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా వీరి నుంచి ఎలాంటి స్పందన లభించడంలేదనే ఆవేదన వీరి నుంచి వ్యక్తమవుతోంది. ఏదైనా సందర్భాల్లో పత్రికల్లో కథనాలు ప్రచురితమైన సమయాల్లో ఫ్యాక్టరీలను వీరు సందర్శించి.. ఆపై మిన్నకుండిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిపై కఠిన చర్యలు చేపట్టి తమ కష్టాలను తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రొయ్యల ప్రాసెసింగ్‌ పేరిట విషాన్ని వదులుతూ..

పైడేరు, మలిదేవి కాలువల్లోకి

యథేచ్ఛగా వ్యర్థాలు

చౌడు బారుతున్న సాగు భూములు

స్పందించని కాలుష్య

నియంత్రణ మండలి

ఈ కాలువల్లోని నీటిని వరి సాగుకు ఉపయోగించడంతో నేల చౌడు బారుతూ.. దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు, గొర్రెలు ముందే మృత్యువాత పడుతున్నాయని వాపోతున్నారు. మలిదేవి కాలువ పక్కనున్న ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్గంధం కారణంగా నార్తురాజుపాళెం, రామన్నపాళెం, రెడ్డిగుంట, నందులగుంట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement