● సచివాలయ సిబ్బందికి
ఏఐటీయూసీ మద్దతు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, అక్రమ అరెస్టులు చేయడం మంచిది కాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు అన్నారు. నెల్లూరులోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను అడిగినా అనుమతి ఇవ్వకుండా, నిరసన కార్యక్రమానికి వస్తే క్రిమినల్ కేసులు పెడతామని సచివాలయ సిబ్బందిని బెదిరించడం సరికాదన్నారు. ధర్నాచౌక్‌కు వస్తున్న వారిని పోలీసులు రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో నిర్బంధించి గుర్తుతెలియని ప్రాంతాలకు తరలించడం దారుణమన్నారు. ఎన్ని అవరోధాలు కల్పించినప్పటికీ వేలాది మంది సచివాలయ సిబ్బంది ధర్నాచౌక్‌కు చేరుకోవడంతో జీర్ణించుకోలేని ప్రభుత్వం.. పోలీసులను ఉసిగొల్పి వారిపై లాఠీచార్జ్ చేసి, కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. సచివాలయ సిబ్బంది పోరాటాలకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు నందిపోగు రమణయ్య, సిరాజ్, షాన్‌వాజ్, షాజహాన్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.


