జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా | - | Sakshi
Sakshi News home page

జై పోలేరమ్మా.. జైజై పోలేరమ్మా

Sep 27 2026 11:54 PM | Updated on Sep 27 2026 11:54 PM

● ప్రారంభమైన వెంకటగిరి జనజాతర

● వైభవంగా ఘటోత్సవం

సైదాపురం/వెంకటగిరిరూరల్‌: రాష్ట్ర పండగైన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అశేష జనసందోహం నడుమ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. జాతరలో మొదటి ఘట్టంగా భావించే ఘటోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును ఘటం వెంటే ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. రాజాల ఇంటి వద్ద తొలి పూజలు అందుకునే సమయంలో తొలుత అమ్మవారి దున్నపోతుకు పూజల అనంతరం ఘటం కుండలకు పూజలు చేయాల్సి ఉంది. కానీ ఈ ఏడాది తొలుత ఘటం కుండలకు పూజలు చేసి అమ్మవారి దున్నపోతును వాహనం దించకుండానే కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అంతకుముందు కాంపాళెంలో దున్నపోతుకు ప్రత్యేక పూజలు చేశారు.

● పట్టణంలోని గాలిగంగుల దేవస్థానంలో ప్రత్యేక పూజలతో ఘటోత్సవాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జీనిగల వారి వీధిలో ఉన్న చాకలి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. మొదటగా పత్తివారి సాంగ్యాన్ని ఘటం కుండలకు సమర్పించి పూజలు చేశారు. జీనిగల వారివీధి వద్ద ప్రారంభమైన ఘటోత్సవం ఆంజనేయస్వామి గుడివీధి మీదుగా పోలేరమ్మ దేవస్థానం వద్దకు చేరుకుంది. అనంతరం పోలేరమ్మ వీధిగండా రాజావీధి, రాజానగరి వెనుక వైపు గల పత్తివారి ఇంటికి ఘట్టం చేరుకుంది. రాజాల అనుచరులు ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమైన లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.

● జాతరలో భాగంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాలకు పెద్దపీట వేశారు. ఆ రోజుల్లో వెంకటగిరి సంస్థానాధీశుల దగ్గర పనిచేసే తాడిపత్రి వెంకట్రాయులను ఉద్దేశించి ఏమైనా ఆస్తులు, సంపద కోరుకోవాలని సూచించగా.. ఆయన అందుకు ప్రతిగా ‘నాకేమీ వద్దు. పోలేరమ్మ తల్లి జాతరలో ఘటంకు ముందుగా మీ ఇంట పూజలు నిర్వహించిన అనంతరం మా ఇంట రెండో పూజ జరిగేలా చూడాలి’ అని కోరుకోవడంతో అప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగుతోంది. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, సీఐలు రోశయ్య, సంగమేశ్వరరావులు, పోలేరమ్మతల్లి జాతర కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement