కోట: స్థానిక డీడీ మాల్లోని రెడీమేడ్ వస్త్ర దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణం లోపలి నుంచి పొగలు వస్తుండటాన్ని గుర్తించిన యజమాని ప్రభాకర్‌రెడ్డి వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మంటల్లో దుస్తులు, సామగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, లోఓల్టేజీ, హైఓల్టేజీ సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
జర్నలిస్ట్ అవార్డుల దరఖాస్తుల
గడువు పొడిగింపు
నెల్లూరు(రూరల్): 2025 సంవత్సరానికి సంబంధించిన ఉత్తమ జర్నలిస్టు అవార్డుల దరఖాస్తుల గడువును అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకుడు కేఎస్ విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం 12 విభాగాల్లో అవార్డులు ప్రకటించిందన్నారు. అర్హులైన జర్నలిస్టులు 2025లో ప్రచురితమైన లేదా ప్రసారమైన కనీసం ఐదు వార్తా కథనాలు, వ్యాసాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్‌తో దరఖాస్తులను విజయవాడలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయానికి పంపాలని తెలిపారు.
కుక్క అడ్డురావడంతో..
● అదుపు తప్పిన బైక్
● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు
కలిగిరి: మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యర్రగుంట్ల మాధవ్ (35) అనే వ్యక్తి మృతిచెందాడు. యర్రగుంట్ల బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏఎస్‌పేట మండలం అబ్బాసాహెబ్‌పేట ఎస్సీ కాలనీకి చెందిన బాలాజీ తన అత్త ఊరైన కావలి సమీపంలోని బుడమగుంటకు మాధవ్‌తో కలిసి మోటార్‌బైక్‌పై వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని ఇద్దరూ తిరిగి కలిగిరికి బయలుదేరారు. అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్‌లోని ఎస్టీ కాలనీ వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్క అడ్డుగా వచ్చింది. దానిని ఢీకొనడంతో అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మాధవ్ తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాలాజీకి కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం కలిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్య శాలలో చికిత్స పొందుతున్నాడు. మాధవ్ కలిగిరిలోని ఓ హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ, బయట జరిగే కార్యక్రమాలకు కూడా వంట పనులు చేస్తుంటాడు. మృతుడికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. అతని మృతితో అబ్బాసాహెబ్‌పేటలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ రామచంద్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గుండెపోటుతో
సీబీసీఐడీ ఎస్సై మృతి
సింగరాయకొండ: మండలంలోని సోమ రాజుపల్లి పంచాయతీ టీపీనగర్‌కు చెందిన నెల్లూరు జిల్లా సీబీసీఐడీ ఎస్సై చేవూరి ప్రభాకరరావు (57) గుండెపోటుతో మృతిచెందారు. ఆదివారం స్వగ్రామంలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభాకరరావు ఒంగోలులో నివాసం ఉంటూ నెల్లూరు సీబీసీఐడీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నుంచి ఒంగోలుకు రైలులో వస్తుండగా గుండెలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సీఐ పి.శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిజాయితీ కలిగిన అధికారిగా ప్రభాకరరావుకు గుర్తింపు ఉంది. కేసులను ఛేదించడంలో అతడికి ఉన్న ప్రతిభ కారణంగా ఉన్నతాధికారులు ఏరికోరి నెల్లూరులోని సీబీసీఐడీ శాఖకు బదిలీ చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.


