స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు(పొదలకూరు): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సత్తాచాటి అత్యధిక స్థానాలను సాధించేలా కృషి చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముత్తుకూరులో శుక్రవారం నిర్వహించిన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన పింఛన్లనే టీడీపీ నేతలు ప్రస్తుతం అందజేస్తున్నారని చెప్పారు. కొత్త వాటిని కూటమి ప్రభుత్వం నేటికీ మంజూరు చేయలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారని.. ఓట్లను కొల్లగొట్టేందుకు బూటకపు హామీలిస్తుంటారని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిస్తే పింఛన్లను ఎగ్గొడతారేమోననే అభిప్రాయాన్ని ప్రజల్లో టీడీపీ నేతలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో రుణ మాఫీ చేస్తానని చెప్పి.. హామీ పత్రాలను అందజేసి మోసగించిన అంశాన్ని గుర్తుచేశారు.

నాడు మత్స్యకారేతర ప్యాకేజీ అమలు

తమ ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండలంలో మత్స్యకారేతర ప్యాకేజీను అందజేశామని పేర్కొన్నారు. ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున అందజేశామని, అయితే ఎన్నికల కోడ్‌తో అప్పట్లో కొద్ది మందికి అందించలేకపోయామని చెప్పారు. అప్పట్లో విమర్శలు చేసిన సోమిరెడ్డి.. ఇప్పుడెందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. మిగిలిపోయిన మత్స్యకారేతర కుటుంబాలకు బకాయిలను అందజేయాలని డిమాండ్‌ చేశారు. నేలటూరు వద్ద ఫిషింగ్‌ జెట్టీ పనులను నిలిపేశారని.. అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యమే దీన్ని పూర్తి చేసేలా అప్పట్లో పునాది రాయిని వేశారని తెలిపారు. పనులను అర్ధాంతరంగా నిలిపేసి అదనపు నిధుల పేరుతో మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జెట్టీ పనులను 70 శాతం పూర్తి చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు మిగిలిన వాటిని ప్రారంభించలేదని విమర్శించారు.

అంకితభావంతో పనిచేశారు..

ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో తమ పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని చెప్పారు. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు, నేతలను అభినందించారు. సర్వేపల్లిలో సీఎస్సార్‌ నిధులు దుర్వినియోగమవుతున్నాయని, సోలార్‌ లైట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే పెద్ద లైట్లున్న వాటి మధ్యలో సోలార్‌ లైట్లేశారని దుయ్యబట్టారు. పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల బాధ్యుల గుర్తింపు కార్డులను మండల కన్వీనర్‌ మెట్టా విష్టువర్ధన్‌రెడ్డికి అందజేశారు. నేతలు నెల్లూరు శివప్రసాద్‌, గండవరం సుగుణ, దువ్వూరు విశ్వమోహన్‌రెడ్డి, ఈదూరు రామ్‌ప్రసాద్‌రెడ్డి, కోదండరామిరెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, రాగా వెంకటేశ్వర్లు, ఎల్లంగారి సాయి, వెంకటేశ్వర్లు, నవీద్‌బాషా, చెంగారెడ్డి, సురేష్‌, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement