నెల్లూరు(పొగతోట): జెడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలను కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం స్వీకరించారు. వరికుంటపాడులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వసుమతి, పీఆర్ ఎస్‌ఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులకు
దరఖాస్తు చేసుకోండి
నెల్లూరు (టౌన్): జిల్లాలోని పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ఖాళీలున్నాయని, ఎస్జీటీ పోస్ట్‌కు ఇంటర్, డీఎల్‌ఈడీ కోర్సులను చదివి ఉండాలని చెప్పారు. స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కు సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీ, బీఈడీతో పాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలన్నారు. పూర్తిస్థాయి అర్హత గల అభ్యర్థులు లభ్యం కాని సందర్భంలో ఇంటర్ చదివిన వారిని ఎస్జీటీ పోస్ట్‌కు.. డిగ్రీ చదివిన వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపిక చేసే వెసులుబాటుందని వివరించారు. వివరాలకు ఎంఈఓను సంప్రదించాలని సూచించారు.
వింజమూరులో
జాబ్ మేళా నేడు
నెల్లూరు(పొగతోట): వింజమూరులోని నేతాజీ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 91778 24585, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏడు వరకు
అంగన్‌వాడీ ఉత్సవాలు
నెల్లూరు(పొగతోట): సేవా సంకల్ప్ అభియాన్ అమల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ ఉత్సవాలను వచ్చే నెల ఏడు వరకు నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌష్టికాహారం, తల్లీబిడ్డ ఆరోగ్యం, చిన్నారుల ఎదుగుదల, విద్యా తదితర సేవలను అర్హులైన కుటుంబాలకు చేరువ చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తల్లులు, గర్భిణులు, పిల్లలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను ఉత్సహంగా నిర్వహించేలా సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇంటర్ పరీక్ష ఫీజును
అక్టోబర్‌లోపు చెల్లించొచ్చు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్ష ఫీజును అక్టోబర్ 29లోపు చెల్లించాలని ఆర్‌ఐఓ వరప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో నవంబర్ పదిలోపు చెల్లించొచ్చని చెప్పారు. విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించేలా సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ చర్యలు చేపట్టాలని కోరారు.


