ప్రశాంతత చెదిరి..ప్రతీకారం రగిలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతత చెదిరి..ప్రతీకారం రగిలి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీసుల నిఘా, నేరనియంత్రణ చర్యలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, ఘర్షణలు ప్రజలను కలవరపెడుతున్నాయి. చిన్నపాటి వివాదాలు సైతం తీవ్రరూపం దాల్చి ప్రాణాలు తీసే స్థాయికి చేరుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో ఏడు హత్యలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హత్యాయత్నాలు, దాడులు పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాత్రివేళల్లోనే కాకుండా పగటిపూట కూడా నేరాలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల భద్రతపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

మత్తు.. నేరాలకు ఊతం

మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం కొన్ని నేరాలకు నేపథ్యంగా మారుతోంది. మత్తులో నేరాలు అధికమవుతున్నాయి. నిషాకు బానిసైన కొందరు, పాతనేరస్తులు కొందరు తమ అవసరాలకు నగదు కోసం రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసకుంటున్నారు. కత్తులతో బెదిరించి నగదు, సెల్‌ఫోన్లను దోచుకుంటున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఏఎస్‌పేటలో ఓ వ్యక్తిని కత్తితో చంపుతామని బెదిరించి రూ.2 వేల నగదు దోచుకెళ్లారు. నెల్లూరు నగరంలో రౌడీషీటర్లు ఓ యువకుడిని, ఓ వ్యాపారిని కత్తితో చంపుతామని బెదిరించి నగదు దోచుకున్నారు. కలిగిరిలో మద్యం మత్తులో ఓ వృద్ధుడిని హత్య చేశారు.

వరుస ఘటనలు

పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు తదితర కారణాలతో హత్యలు, హత్యాయత్నాలు తరచూ జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో పాతకక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. నెల్లూరు రూరల్‌ మండలం అశోక్‌ నగర్‌ లండన్‌ లేఅవుట్‌లో ఓ యువకుడిని తెలిసినవారే చంపారు. పొట్టేపాళెం సమీపంలోని ఓ లేఅవుట్‌లో మరో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. తాజాగా నెల్లూరు నగరంలో గురువారం పట్టపగలు ఇద్దరు యువకులు పాతకక్షలతో రౌడీషీటర్‌ ప్రదీప్‌ కళ్లలో కారం కొట్టి గొంతుకోసి పరారయ్యారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.

కొరవడిన నిఘా

నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ప్రస్తుతం ఏం చేస్తున్నారు?, ఎవరెవరిని కలుస్తున్నారు?, ఏవైనా వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారా?, వారి కదలికలు ఎలా ఉన్నాయి? వంటి అంశాలపై పోలీసుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అయితే ఈ ప్రక్రియ నామమాత్రంగా మారిందన్న విమర్శలున్నాయి. నేరం జరిగిన తర్వాత నిందితులను అరెస్ట్‌ చేయడం కంటే నేరానికి దారితీసే పరిస్థితులు ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో పోలీసులు విఫలమమ్యారన్న విమర్శలున్నాయి.

ఏం చేయాలంటే..

పాతనేరస్తుల వివరాలను స్టేషన్‌ల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వారి ప్రస్తుత కార్యకలాపాలు, ఎవరిని కలుస్తున్నారు, ప్రత్యర్థి వర్గాలతో ఏమైనా విభేదాలున్నాయా, ఇటీవల ఏవైనా గొడవలు జరిగాయా వంటి అంశాలపై సమాచారం సేకరించాలి. సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ముందస్తు సమాచారం ఉంటే నేరాలకు ముందుగానే అడ్డుకట్టవేసే అవకాశం ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణలో లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతోపాటు స్పెషల్‌ బ్రాంచ్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ విభాగాలు పనిచేయాలి. ఒక ప్రాంతంలో నేరచరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలకు సంబంధించిన సమాచారం అందినప్పుడు సంబంధిత పోలీసు విభాగాలు పరస్పరం పంచుకుని ముందస్తు చర్యలు చేపట్టాలి. అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సమస్యాత్మక వ్యక్తులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, పాత వివాదాలను గుర్తించడం, ఘర్షణలకు దారితీసే పరిస్థితులను ముందుగానే అంచనా వేయడం ద్వారా నేరాలను నియంత్రించే అవకాశం ఉంది.

సింహపురిలో హత్యలు, దాడులు

రెండు నెలల వ్యవధిలో ఏడు మర్డర్లు

వరుస నేరాలతో ఆందోళన

కట్టడికి పటిష్ట నిఘా ఏదీ?

పాతనేరస్తులపై నిఘా కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement