పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, చిత్రంలో నేతలు
● ఉదయగిరి సమన్వయకర్త
మేకపాటి రాజగోపాల్‌రెడ్డి
వింజమూరు(ఉదయగిరి): ‘చంద్రబాబు పాలనలో ఎప్పుడూ చూసినా కరువు విలయతాండవం చేస్తుంది. అరాచకాలు జరుగుతాయి. అవినీతి, అక్రమాలు, దోపిడీకి అంతు ఉండదు’ అని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వింజమూరులోని వీఆర్ ఫంక్షన్ ప్లాజాలో మంగళవారం పార్టీ మండల కన్వీనర్ ఆర్.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు, వైఎస్సార్ కుటుంబీకుల పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. పేదల బాగోగుల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారన్నారు. చంద్రబాబు పాలనంతా ధనవంతులకే తప్ప, సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్నారు. టీడీపీ పాలనలో ఎక్కువ కాలం కరువు కాటకాలేని గుర్తుచేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రజలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం నేడు రాష్ట్రంలో చూస్తున్నామని తెలిపారు. డీఎస్సీలో అక్రమాలు నిలదీసే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని, దీనికి మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ఎన్నికల్లో కలిసి పనిచేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యాలను, అక్రమాలను నిలదీయాలన్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి నేతలు సమన్వయంతో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు కూనం సుధాకర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు గురించి వివరించారు. అనంతరం మండల, గ్రామ కమిటీల సభ్యులకు గుర్తింపుకార్డులు అందజేశారు. కార్యక్రమంలో నేతలు పల్లాల కొండారెడ్డి, మద్దూరి బాబు, నారాయణరెడ్డి, డేగా వంశీ, రొడ్డ కొండయ్య, మలిరెడ్డి విజయరెడ్డి, గణపం రమేష్, చిన్నికృష్ణ, కాలేషా, కొండపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.


