ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రతి వార్డులో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యం

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

బుచ్చి చైర్మన్‌ అభ్యర్థిగా

కడివేటి శ్రీనివాసులురెడ్డి

మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి

ప్రసన్నకుమార్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బుచ్చిరెడ్డిపాళెంలోని ఇసుకపాళెంలో మండల స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టకాలంలో నిలిచిన ముగ్గురు కౌన్సిలర్లను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి గుర్తింపు ఇవ్వడమే తమ విధానమని చెప్పారు. కష్టకాలంలో పనిచేసిన వారిని పక్కనపెట్టి ఎన్నికల సమయంలో వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థిగా కడివేటి శ్రీనివాసులురెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆయన సౌమ్యుడని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి ఎంపిక విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు డబ్బులు తీసుకుని వచ్చే అవకాశం ఉందన్నారు. ఓటు మాత్రం ఫ్యాన్‌ గుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలను డబ్బుతో ప్రభావితం చేయడం కంటే గతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి మద్దతు కోరాలని సూచించారు. టీడీపీకి చెందిన కొంతమంది నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేసి టికెట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలను పార్టీ శ్రేణులు గమనించాలని సూచించారు.

పార్టీ కోసం నిలిచిన వారికే గుర్తింపు

ప్రస్తుతం పార్టీతో ఉన్నవారే అసలైన నాయకులు, కార్యకర్తలని ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు సమీపించినప్పుడు వచ్చేవారు, రాజకీయంగా వివిధ రకాలుగా వ్యవహరించే వారు వస్తారు.. పోతారని వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీకి విధేయత, ప్రజలతో సంబంధాలు, వార్డు స్థాయిలో ఉన్న పరిచయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి సుమారు రూ.230.44 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించామన్నారు. గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేస్తూ ప్రతి వార్డులో ఓటర్లను కలవాలని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు, కన్వీనర్లు షాహుల్‌, సతీష్‌రెడ్డి, కోడూరు మధుసూదన్‌రెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, షకీలా బేగం, మోర్ల జయంతి, బిట్రగుంట ప్రమీలమ్మ, గొల్లపల్లి విజయ్‌కుమార్‌, విల్సన్‌, ప్రవళ్లిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement