● ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
● ఇరుక్కున్న డ్రైవర్,
అరగంట తర్వాత వెలికితీత
● శ్రమించిన పోలీసులు, హైవే,
108 సిబ్బంది
● డ్రైవర్ సహా ఇద్దరికి తీవ్ర గాయాలు
కొడవలూరు: అంత్యక్రియల సామగ్రి తీసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తున్న ఆటో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలోనే ఇరుక్కుపోగా సుమారు అరగంటపాటు పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది, 108 సిబ్బంది శ్రమించి ఆయన్ను బయటకు తీశారు. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెం హైవేపై ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పాతవంగల్లుకు చెందిన వి.రమేష్ (38) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని పెద్దమ్మ సోమవారం రాత్రి మృతిచెందారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన పూలు, ఇతర సామగ్రి తీసుకొచ్చేందుకు సమీప బంధువు గోపాల్‌ను వెంటబెట్టుకుని ఆటోలో నెల్లూరుకు వెళ్లాడు. సామగ్రి తీసుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. నార్తురాజుపాళెం హైవేపై ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొంది. దీంతో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. రమేష్‌కు తీవ్ర గాయాలై రెండు కాళ్లు వాహనంలో ఇరుక్కుపోయాయి. గోపాల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. రమేష్‌ను బయటకు తీసేందుకు హైవే మొబైల్ సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది అరగంటపాటు శ్రమించారు. ఇనుప గొలుసులతో ఆటోను ఒకవైపు అంబులెన్స్‌కు, మరోవైపు కంటైనర్ వాహనానికి కట్టి ఇరువైపులా లాగి బయటకు తీశారు. అప్పటి వరకు ఆటోలో ఇరుక్కుపోయిన రమేష్ తీవ్ర వేదన అనుభవించాడు. గాయపడిన ఇద్దరికీ 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్ ప్రాథమిక చికిత్స అందించి నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రమేష్‌ను సురక్షితంగా బయటకు తీసిన 108, పోలీసు, హైవే మొబైల్ సిబ్బంది చొరవను స్థానికులు అభినందించారు. ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు అందాల్సి ఉందని ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి తెలిపారు.


