హత్యాయత్నం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నలుగురికి ఐదేళ్ల జైలు

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

నెల్లూరు(లీగల్‌): పాతకక్షలతో ఓ వ్యక్తిపై కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో నెల్లూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సయ్యద్‌ ముజుమిల్‌, బత్తల నారాయణ, తలపనేని విష్ణు, కాసరం సుబ్రహ్మణ్యంకు శిక్ష పడింది. ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు, రూ.5 వేల వంతున జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి ఎస్‌.శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు చెప్పారు. కాగా ఇదే కేసులో షేక్‌ రియాజ్‌ అనే వ్యక్తిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసు కొట్టేశారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. నెల్లూరు పరమేశ్వరి నగర్‌కు చెందిన షేక్‌ జాకీర్‌, నిందితులకు వ్యక్తిగతంగా పాతకక్షలుండేవి. ఈ నేపథ్యంలో నిందితులు జాకీర్‌పై దాడికి అవకాశం కోసం ఎదురుచూశారు. 2024 ఫిబ్రవరి 4వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో ఫిర్యాది సోహైల్‌ తన మామ జాకీర్‌తో కలిసి మోటార్‌బైక్‌పై మెక్లిన్స్‌ రోడ్డు ప్రాంతంలో వెళ్తున్నారు. నిందితులు వారిని దౌర్జన్యంగా ఆపారు. వెంటనే జాకీర్‌ను ముజుముల్‌ కత్తితో పొడవుగా మిగిలిన వారు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. దీంతో జాకీర్‌కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన సోహైల్‌పై కూడా దాడి చేయగా గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు రావడంతో దాడి తర్వాత నిందితులందరూ పరారయ్యారు. ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సోహైల్‌ చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సమగ్ర దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నలుగురికి పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఇన్‌చార్జి పీపీ ఎం.చెంచుకృష్ణ కేసు వాదించారు.

మున్సిపల్‌ ఉద్యోగి దాదాగిరి

రోజువారి మామూళ్లు ఇవ్వలేదని దాడి

కావలి(అర్బన్‌): ఓ యువకుడు తోపుడు బండిపై పండ్లు విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జీవితం గడుపుతున్నాడు. అతను రోజువారి మామూళ్లు ఇవ్వలేదని మున్సిపల్‌ ఉద్యోగి దాడి చేసిన అమానుష ఘటన సోమవారం కావలి పట్టణ ఐకాన్‌ సమీపంలో చోటుచేసుకుంది. మంగళవారం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరలైంది. దీంతో ప్రజలు సదరు ఉద్యోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన అల్లాభక్షు అనే నిరుపేద యువకుడు తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటున్నాడు. 7, 8, 9 వార్డుల శానిటేషన్‌ మేస్త్రి రసూల్‌ రోజువారి మామూళ్లు కింద అల్లాభక్షు నుంచి పండ్లు తీసుకుంటాడు. సోమవారం వ్యాపారం జరగక పండ్లు ఇవ్వలేనని చెప్పడంతో ఒక్కసారిగా రసూల్‌కు కోపం కట్టలు తెంచుకుంది. అల్లాభక్షు చొక్కా పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి వారించే ప్రయత్నం చేయగా కనికరించని రసూల్‌ మరింత రెచ్చిపోయి కింద పడవేసి కాలితో తొక్కి గాయపరిచాడు. అదేమని ప్రశ్నిస్తే దిక్కున్న చోటు చెప్పుకో.. నా సంగతి నీకు తెలియదంటూ వేలు చూపిస్తూ వెళ్లాడని చెబుతున్నారు. ఈ దౌర్జన్యకాండపై సంబంధిత అధికారులు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

వచ్చేనెల 6న

జిల్లా యువజనోత్సవాలు

నెల్లూరురూరల్‌: జిల్లా యువజనోత్సవాలను అక్టోబర్‌ 6వ తేదీన నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో నిర్వహించనున్నట్లుగా సెట్నెల్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. జానపద నృత్యం, జానపద గీతం, వీధి నాటకం, చిత్రలేఖనం, కవితా రచన విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు, అక్కడ విజేతలు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఆసక్తి ఉన్న యువత అక్టోబర్‌ 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 94407 84755 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement