పదవి నుంచి దించేందుకు కూటమి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

పదవి నుంచి దించేందుకు కూటమి కుట్రలు

Sep 22 2026 11:43 PM | Updated on Sep 22 2026 11:43 PM

జగన్‌, ప్రజల ఆశీస్సులతో పనిచేశా

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(వేదాయపాళెం): ‘కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నన్ను పదవి నుంచి తప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగకుండా నాకు అండగా నిలిచి ముందుకు నడిపించారు’ అని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ తెలిపారు. సహచర జెడ్పీటీసీ సభ్యులతో మంగళవారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రజల ఆశీస్సులతో ఐదేళ్లపాటు నిర్విరామంగా చైర్‌పర్సన్‌గా పనిచేశానని వెల్లడించారు. రాగద్వేషాలు, పార్టీలకతీతంగా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయగలిగాననే సంతృప్తి లభించిందన్నారు. తాను కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఇటీవల మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఆనం వారి కోడలుగా, గృహిణిగా ఉన్న తనను ప్రజాసేవ కోసం వైఎస్సార్‌సీపీ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. పదవులపై ఆసక్తి లేదని తెలిపారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకొని, ఆదరించి, పునర్జన్మనిచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడవడం వంటి విద్యలు తనకు తెలియదని ఆమె తేల్చిచెప్పారు.

ప్రజలు గుణపాఠం చెబుతారు

కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండి ఇబ్బంది పెట్టారని అరుణమ్మ గుర్తుచేశారు. నేడు మంత్రిగా ఉండి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. ఈనెల 17న నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశం, మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశాలకు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరుకాకుండా అడుగడుగునా అడ్డుతగిలిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. జెడ్పీలో ప్రస్తుతం రూ.4 కోట్ల నిధులుంటే వాటిలో రూ.కోటి అభివృద్ధి పనులను తాము ఆమోదిస్తే, వాటిని అడ్డుకుని గ్రామీణ ప్రజలకు కనీస వసతులు అందకుండా చేస్తున్న నాయకులకు రానున్న ఎన్నికల్లో పరాజయం తప్పదన్నారు. గడిచిన రెండేళ్లలో సీఈఓ, అధికారులు సహకరించకపోయినా సభ్యుల సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తించినట్లు చెప్పారు. అరుణమ్మ పదవి కోసం, కుర్చీ కోసం బాధపడుతోందని రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను జెడ్పీటీసీ సభ్యులందరూ ముక్తకంఠంతో ఖండించారు, మంత్రి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సమావేశానికి ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని చైర్‌పర్సన్‌తోపాటు సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement