● డప్పు వాయిస్తూ విన్నవించిన కళాకారుడు
ఆత్మకూరు: ఆయన వృత్తి డప్పు వాయించడం.. జీవనాధారం కూడా అదే. ప్రభుత్వం డప్పు కళాకారులకు పింఛన్ మంజూరు చేస్తుందని ఆశపడ్డాడు. అవసరమైన పత్రాలన్నీ అందజేశాడు. అయినా పింఛన్ వస్తుందో.. రాదో అన్న సందేహం వెంటాడింది. దీంతో తన కళే తనకు సాక్ష్యమని భావించి డప్పు భుజాన వేసుకుని మున్సిపల్ కార్యాలయం బాట పట్టాడు. ప్రభుత్వం ఇటీవల డప్పు కళాకారులకు సెల్ఫ్ డిక్లరేషన్‌తో పెన్షన్ మంజూరు చేసేలా జీఓ ఇచ్చింది. అయితే దానిని సచివాలయ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో పట్టణానికి చెందిన డప్పు కళాకారుడు రామచంద్రయ్య పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం తన ఇంటి వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు డప్పు వాయిస్తూ తన సమస్య అందరికి తెలిసేలా ప్రదర్శనగా చేరుకున్నాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఎందుకిలా డప్పు వాయిస్తున్నాని ప్రశ్నించగా తనకు సంబంధించిన అన్ని పత్రాలను అందజేసి పెన్షన్ మంజూరవుతుందా లేదా అన్న అనుమానం నెలకొన్నట్లు చెప్పాడు. దీంతో స్వయంగా డప్పు వాయించుకుంటూ వచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో సచివాలయ సిబ్బంది అతనికి సంబంధించిన పత్రాలు తీసుకున్నామని, ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, ఇక ప్రభుత్వ నిర్ణయం మేరకు పెన్షన్ మంజూరవుతుందని చెప్పారు.
వచ్చేనెలలో లాయర్స్
యూనియన్ మహాసభలు
● ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య
నెల్లూరు(లీగల్): ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సమావేశ మందిరంలో యూనియన్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో రెండురోజులపాటు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 మంది న్యాయవాదులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, గుంజి దయాకర్, ఐవీ రామశాస్త్రి, బాలసుబ్రహ్మణ్యం, వి.రంగారావు, ఆరిఫ్ మాలిక్, సద్విన్ కుమార్, వెంకటరామయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


