12న జాతీయ లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

నెల్లూరు (లీగల్‌): ఈ నెల 12న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కోర్టు హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న నెల్లూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, కోట, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నామని తెలిపారు. ఆయా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌, వివాహ, మోటార్‌ వాహన ప్రమాద, రాజీ పడదగిన ఇతర కేసుల్లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులను రాజీ చేసుకోవాలని కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో

నిందితుడికి జీవిత ఖైదు

గూడూరు: చిన్నపాటి వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి గూడూరు ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన వింగవాసం జోగేంద్ర అలియాస్‌ జోగి, అలియాస్‌ బొగ్గు ఇంజన్‌, అదే ప్రాంతానికి చెందిన కామేష్‌ రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వారు. వారి ఇద్దరి మధ్యన మనస్పర్థలు రావడంతో అప్పుడప్పుడు ఘర్షణ పడే వారు. ఈ నేపథ్యంలో 2023 మార్చి 23న గూడూరు రైల్వే స్టేషన్‌ వద్ద ఇరువురి మధ్యన వివాదం నెలకొని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఆ తరువాత కామేష్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆర్‌ఎం ఆఫీస్‌ వద్ద నిద్రిస్తున్న సమయంలో తలపై నిందితుడు జోగేంద్ర సిమెంట్‌ కాంక్రీట్‌ దిమ్మెతో రెండుసార్లు కొట్టడంతో మృతి చెందాడు. రైల్వే స్టేషన్‌ సిబ్బంది ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటి సీఐ హజరత్‌బాబు కేసు నమోదు చేసి నిందితుడు జోగేంద్రను కోర్టులో హాజరుపరచారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొత్తపల్లి వంసతకుమార్‌ నేర నిరూపణ చేయడంతో నిందితుడు జోగేంద్రకు జీవిత ఖైదు, రూ5వేలు జరిమానా విఽధిస్తూ కోర్టు తీర్చునిచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని పేర్కొంది. ఈ కేసును పర్యవేక్షణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు, కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌ డీ మల్లికార్జున, హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావును ఎస్పీ అజిత్‌ వేజెండ్ల అభినందించారు.

2.87 లక్షల మందికి

పింఛన్లు

నెల్లూరు(పొగతోట): జిల్లాలో మంగళవారం సామాజిక పింఛన్ల నగదు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,87,970 మంది లబ్ధిదారులకు రూ.126 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 13,265 క్లస్టర్లల్లో 6,593 మంది ఉద్యోగుల ద్వారా నగదు అందజేయనున్నట్లు చెప్పారు. పింఛన్‌ లబ్ధిదారులు అందుబాటులో ఉండి నగదు తీసుకోవాలని సూచించారు.

150 కేజీలకు మించిన

పొగాకు బేళ్ల తిరస్కరణ

మర్రిపాడు : పొగాకు రైతులు 150 కేజీలకు మించిన బేళ్లను వేలానికి తీసుకొస్తే తిరస్కరించడం జరగుతుందని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పొగాకు రైతులు వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఉదయం కాటాలు వేసే సమయంలో రైతులు స్వయంగా దగ్గర ఉండి టీబీజీఆర్‌ నంబర్లు వేయించుకోవాలని తెలిపారు. వేలానికి ముందు రోజు వచ్చి మార్కెట్‌ పరిస్థితిని పరిశీలించి కొనుగోలు చేసే బేళ్లను మాత్రమే తీసుకురావాలని సూచించారు. సెప్టెంబర్‌ 2న గుండెమడకల క్లస్టర్‌–5, ఆదురుపల్లి క్లస్టర్‌–8, 3న డీసీపల్లి క్లస్టర్‌–6, 4న నెల్లూరుపాళెం క్లస్టర్‌–7కు సంబంధించిన రైతుల బేళ్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. బ్యారెన్‌కు నాలుగు బేళ్లు, అర బ్యారెన్‌కు రెండు బేళ్ల చొప్పున వేలానికి తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement