ఎస్సీ నేతపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ నేతపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

టీడీపీలో ఉండి ప్రశ్నించడంతో మౌనం

వైఎస్సార్‌సీపీలో చేరడమే నేరం

గంటల వ్యవధిలో వరుస కేసులతో భయభ్రాంతులు

పల్లి కోటేశ్వరరావును అరెస్ట్‌

చేయొద్దన్న హైకోర్టు

అయినా అరెస్ట్‌ చేస్తే..

గూడూరు కోర్టు బెయిల్‌

మళ్లీ అదుపులోకి తీసుకుని

మరో రెండు కేసులు నమోదు

బెయిల్‌ మంజూరు

గూడూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పల్లి కోటేశ్వరరావుపై పోలీసుల ద్వారా అక్రమ కేసులను అధికార పార్టీ నేతలు బనాయించి రిమాండ్‌కు పంపాలని చూసినా, ఆయనపై పెట్టిన కేసులను పరిశీలించిన కోర్టు బెయిల్‌ను మంజూరు చేసిందని పార్టీ లీగల్‌ సెల్‌ న్యాయవాది రాఘవరెడ్డి తెలిపారు. ఈ మేరకు వివరాలను పట్టణంలో మంగళవారం ఆయన వెల్లడించారు. తమ వద్ద పల్లి కోటేశ్వరరావు బలవంతంగా నగదు వసూళ్లకు పాల్పడ్డారంటూ అధికార పార్టీకి చెందిన వారు కేసు పెట్టారని, దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఊరట లభించిందని చెప్పారు. అయినా గూడూరు ఒకటో పట్టణ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో హాజరుపర్చారని, వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసిందని వివరించారు. మరో కేసు నమోదైందంటూ వెంటనే ఆయన్ను రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో మంగళవారం హాజరుపర్చారని, అక్కడ వాదనలు విన్న న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్‌ను మంజూరు చేశారని చెప్పారు. కోటేశ్వరరావుపై మోపిన అన్ని కేసుల్లో ఊరట లభించిందన్నారు.

గూడూరు: ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఓ ఎస్సీ నేతపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ రాక్షసం ప్రదర్శిస్తున్నారు. గూడూరులో అధికార పార్టీ అండదండలతో సాగుతున్న భూకబ్జాలు, అక్రమాలు, దందాలను అదే పార్టీలో గూడూరు పట్టణ ఎస్సీ సెల్‌ నాయకుడు పల్లి కోటేశ్వరరావు గత నెల 21న ధర్మరాజుల స్వామి ఆలయంలో జరిగిన భూముల లీజు వేలంపై ప్రశ్నించాడు. అంతకు ముందూ అక్రమాలను ప్రశ్నించాడు. అయితే ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరడమే నేరంగా భావించి స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పోలీసులను అడ్డు పెట్టుకుని వరుసగా అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తున్న తీరుపై నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక కేసులో కోర్టు నుంచి ఊరట లభించిన వెంటనే మరో అక్రమ కేసు నమోదు చేస్తూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసి గూడూరు నియోజకవర్గంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం ఉందా? ఎమ్మెల్యే పాశం సునీల్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తుందా? అని పలువురు దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు.

కేసులు.. అరెస్ట్‌ నుంచి

గూడూరులోని ధర్మరాజుల స్వామి దేవస్థానంలో గత నెల 21న ఆలయ భూముల లీజు వేలం సరైన పద్ధతిలో జరగడం లేదని గూడూరు పట్టణ టీడీపీ ఎస్సీ సెల్‌ నేతగా పల్లి కోటేశ్వరరావు దేవదాయశాఖ అధికారులను ప్రశ్నించాడు. అప్పుడు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత పల్లి కోటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ మరుసటి రోజు 28వ తేదీన ఆలయ ఈఓ రవికృష్ణపై ఒత్తిడి తెచ్చి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి కేసు పెట్టించారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌ ఇలా తనపై అక్రమ కేసు పెట్టి సాటి దళితుడిని ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఓ హోటల్‌లో కోటేశ్వరరావు ప్రెస్‌మీట్‌ పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే ఆ హోటల్‌ యజమానిని హోటల్‌లో ఎలా ప్రెస్‌మీట్‌లు పెట్టనిస్తారంటూ బెదిరించడం, వెంటనే రూం ఖాళీ చేయించాలని ఆదేశించడంతో యాజమాన్యం హోటల్‌ గదులను ఖాళీ చేయించారు. ఆ తరువాత పల్లి కోటేశ్వరరావు తనను బెదిరింపులకు గురి చేసి నగదు డిమాండ్‌ చేశాడని ఓ పారిశ్రామికవేత్తతో ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వారం తిరగక ముందే నాన్‌ బెయిల్‌ రెండో కేసుగా నమోదు చేయించారు. ఈ కేసులో బెయిల్‌ కోసం కోటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించి క్వాష్‌ పిటిషన్‌ వేయడంతో విచారణ సమయంలో అరెస్టులు చేయకూడదని ఆదేశించింది. సోమవారం కోటేశ్వరరావుకు కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన నేరుగా గూడూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి తనపై జరుగుతున్న కుట్రలను, ఎమ్మెల్యే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి విలేకరుల సమావేశం జరిగే ప్రాంతానికి పంపించి నానా హంగామా సృష్టించారు. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిన పోలీసులు అరెస్ట్‌ చేయడమే కాకుండా, అధికార పార్టీ వర్గీయులతో పల్లి కోటేశ్వరరావుపై కొంత మంది రౌడీషీటర్స్‌తో భౌతిక దాడికి యత్నాలు చేసేందుకు చేసిన ప్రయత్నాలతో పోలీసుస్టేషన్‌ వద్ద గత రాత్రి హైడ్రామా నడిచింది. ఆ తర్వాత ఎట్టకేలకు రాత్రి 11 గంటల సమయంలో పల్లిని రిమాండ్‌ కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి రిమాండ్‌ను తిరస్కరించినా విడిచి పెట్టకుండా గూడూరు టు టౌన్‌ పోలీసులు మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అప్పటికే పథకం ప్రకారం రెండో పట్టణానికి చెందిన బెజవాడ రమేష్‌ అనే వ్యక్తి కోటేశ్వరరావు తనను నగదు ఇవ్వాలని బెరించాడని అందుకు తాను రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసులకు పిర్యాదు చేయగా కోటేశ్వరరావుపై మరో కేసును బనాయించి మంగళవారం గూడూరు కోర్టుకు హాజరు పరిచారు. అలాగే మరో కేసును ఒకటో పట్టణం పోలీస్‌స్టేషన్లో నమోదు చేయించేందుకు ఉద్యోగులను పురమాయిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించడమే నేరమా?

స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ అవినీతిని, అక్రమాలను నిలదీస్తూ ప్రజల పక్షాన నిలిచిన గొంతును నొక్కేందుకే ఈ కుట్రలు సాగుతున్నాయని గూడూరు నియోజకవర్గం దళితులు భావిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న భూముల వేలం ప్రక్రియలో పాల్గొని వాస్తవాలు వెలుగులోకి తెస్తాడనే భయంతోనే ముందస్తుగా ఈ అరెస్ట్‌ల పర్వానికి తెరలేపారని చర్చ సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం అధికార పార్టీ కార్యకర్తలతో వరుస ఫిర్యాదులు చేయిస్తూ, ఒక్కో కేసు తర్వాత మరొక కేసు పెడుతూ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వైఎస్సార్‌సీపీ నేత కోటేశ్వరరావును బయటకు రాకుండా చక్రబంధం పన్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement