● కసుమూరు, ఏఎస్‌పేటకు పోటెత్తిన భక్తులు
వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలీ దర్గా 249వ గంధ మహోత్సవాలు మంగళవారం రాత్రి 11 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సందడి మొదలైంది. భక్తులు తొలుత దర్గాను సందర్శించి, గంధ మహోత్సవం ప్రారంభమయ్యే చందన్‌మహల్ వద్ద సేదతీరారు. కాగా ఏర్పాట్లకు వక్ఫ్ బోర్డు రూ.19 లక్షలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు పలుచోట్ల విద్యుద్దీపాలు, దర్గాకు పెయింటింగ్, పారిశుద్ధ్య పనులు చేపట్టామంటున్నారు. గంధ మహోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోటాపోటీగా గంధం దంచిన మహిళలు
అనుమసముద్రంపేట: హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గాలో 253వ గంధ మహోత్సవం సందర్భంగా మహిళలు గంధం దంచేందుకు పోటీ పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేకమంది భక్తులు మంగళవారం దర్గాకు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దర్శనం అనంతరం మహిళలు గంధం దంచేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. మహల్ వద్ద ముతవల్లీ హఫీజ్‌పాషా గంధం దంచేందుకు ఏర్పాటు చేయగా మరో వర్గం ఫయాజ్ అహ్మద్ తన ఇంటి వద్ద చర్యలు తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవలే ఇద్దరు గంధం దంచేందుకు అధికారం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇరువర్గాలకు అనుమతి ఇచ్చింది.


