చీకటి ఒప్పందాలతో దగా | - | Sakshi
Sakshi News home page

చీకటి ఒప్పందాలతో దగా

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

శ్రీశైలం జలాలను సోమశిలకు

వెంటనే విడుదల చేయాలి

ఏ ప్రయోజనాలను ఆశించి

తెలంగాణకు తాకట్టు పెట్టారు..?

రైతులను సర్కార్‌ ఆదుకోకపోతే

పంటలు ఎండిపోవడం ఖాయం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

అన్నదాతలతో కలిసి

నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన

సాగునీటి కోసం కదంతొక్కిన రైతాంగం

నెల్లూరు రూరల్‌: శ్రీశైలంలో జలాలు పుష్కలంగా ఉన్నా.. దిగువ ప్రాజెక్టులకు విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కరువును సీఎం చంద్రబాబు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు నీటిని వెంటనే విడుదల చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్‌తో నెల్లూరు బ్యారేజీ వద్ద భారీ నిరసన ప్రదర్శనను కాకాణి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌, పార్టీ నెల్లూరు రూరల్‌, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, బూదూరు గురవయ్య, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. నిత్యం ఐదు టీఎంసీలను తెలంగాణ తరలించుకెళ్తున్నా, ఇక్కడి ప్రభుత్వం మౌనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ ప్రయోజనాలను ఆశించి శ్రీశైలం జలాలను తాకట్టు పెట్టారని నిలదీశారు.

మీనమేషాలను లెక్కిస్తున్న సర్కార్‌

శ్రీశైలం జలాశయంలో నీరు అందుబాటులో ఉన్నా, సోమశిలకు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎందుకో మీనమేషాలను లెక్కిస్తోందన్నారు. నిత్యం ఒక టీఎంసీ చొప్పున తరలించే అవకాశమున్నా, స్పందించడంలేదని మండిపడ్డారు. ఇరిగేషన్‌ నిపుణులమని చెప్పుకొనే అధికార పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలు..!

చంద్రబాబు.. కరువు.. కవల పిల్లలని, రైతుల కష్టాలకు ఇవే ప్రతీకలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగు, తాగునీటి సమస్యలు చుట్టుముట్టాయని ఆరోపించారు. నెల్లూరు డెల్టా పరిధిలోని రైతులకు నీటి యాజమాన్య హక్కులున్నాయని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా.. ప్రత్యామ్నాయ పంటలు, పశుగ్రాసం, సాగు, తాగునీటి సరఫరాపై ఎలాంటి సమీక్షలను నిర్వహించడంలేదని విమర్శించారు. రైతులకు ప్రయోజనం చేకూర్చకుండా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల్లో నిధుల దుర్వినియోగానికి కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అన్నదాతల పేరిట నిధులు, బిల్లుల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు.

బ్యారేజీలకు పేర్లు మారుస్తారా..?

నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణానికి దివంగత సీఎం వైఎస్సార్‌ పునాది వేయగా, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వీటిని పూర్తి చేసి జాతికి అంకితం చేశారని చెప్పారు. వీటికి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్లు పెట్టగా, వాటిని తొలగించి పెయింట్లు వేయించడం దారుణమన్నారు. కొత్త ప్రాజెక్టులను నిర్మించే ధైర్యం సర్కార్‌కు లేదని, మహనీయుల పేర్లు తొలగించేందుకు మాత్రం జీఓలను జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు.

అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టలేరు

ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, మీడియా సంస్థలపై అక్రమ కేసులు పెట్టి అణిచేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. కోవూరులో ఫోర్త్‌ ఎస్టేట్‌ ఛానల్‌ సీఈఓ శ్రావణ్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టారనే అంశం భవిష్యత్తులో జరపబోయే విచారణలో తేలితే ఇలాంటి వారిని చంద్రబాబు, లోకేశ్‌ సైతం కాపాడలేరని హెచ్చరించారు. ఆధారాలతో సహా అనిల్‌కుమార్‌యాదవ్‌ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి తమ పార్టీ శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎమర్జెన్సీ, బ్రిటిష్‌ కాలం నాటి పాలనను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తలపిస్తోందని విమర్శించారు. రానున్న రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేయనున్నామని ప్రకటించారు. కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఖలీల్‌ అహ్మద్‌, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వర్‌రెడ్డి, సిటీ నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు ధనుజారెడ్డి, కిషన్‌, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీగా వస్తున్న కాకాణి, శైలజానాథ్‌, విజయకుమార్‌రెడ్డి, గురవయ్య, చలపతిరావు తదితరులు

పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందాన్ని చేసుకొని రాష్ట్ర రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారని వీరి చలపతి ధ్వజమెత్తారు. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా మేలు చేసిందానని ప్రశ్నించారు. పోలీసులెన్ని ఆంక్షలను విధించినా ఆగేది లేదన్నారు.

ప్రభుత్వానికి భయం పట్టుకుంది

ప్రజా సమస్యలపై తమ పార్టీ శ్రేణులు బయటకొస్తుంటే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే పోలీసులను ఉపయోగించి అరాచకానికి పాల్పడుతోందని శైలజానాథ్‌ ఆరోపించారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పంటలెండిపోతున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులు నష్టపోతుంటే.. అధికారులు, పాలకులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని డబ్బులు లెక్కబెట్టుకోవడం సరికాదని విమర్శించారు. అమరావతిలో టీడీపీ నేతలకు నిధులు కేటాయిస్తున్న మంత్రి నారాయణ.. జిల్లా రైతాంగానికి నీరివ్వలేరానని ప్రశ్నించారు. వైఎస్సార్‌ పేరును గుర్తుచేసుకొని ఆయనలా పనిచేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని, అయితే వంద జన్మలెత్తినా అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమంలో వైఎస్సార్‌ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే ముందున్నారని చెప్పారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న రీతిలో చంద్రబాబు తీరు ఉందని, చివరికి వాతలే మిగులుతాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement