అధికారాన్ని అడ్డుపెట్టుకుని..భూ ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

అధికారాన్ని అడ్డుపెట్టుకుని..భూ ఆక్రమణలు

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

వరికుంటపాడు: మండలంలోని డక్కునూరు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొందరు అధికార పార్టీ నాయకులు, భూ ఆక్రమణదారులు పాగా వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పశువుల మేతకు ఉపయోగపడే పోరంబోకు భూములను సైతం యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డక్కునూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 240లో సుమారు మూడెకరాల భూమిలో ముళ్లచెట్లను యంత్రాలతో తొలగించి, భూమిని చదును చేసి బోరు వేశారు. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల ప్రమేయం ఉందని వారు పేర్కొంటున్నారు. ఆదివారం కూడా జేసీబీతో సదరు భూమిలో చదును పనులు చేశారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..

ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, మండలంలోని పలు ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూములు ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారిపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా పశువుల

మేత పోరంబోకు కబ్జా

ఫిర్యాదు చేసినా పట్టించుకోని

రెవెన్యూ అధికారులు

సమగ్ర విచారణకు డిమాండ్‌

డక్కునూరు సర్వే నంబర్‌ 240లోని భూమిపై రెవెన్యూ అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే భూమిని స్వాధీనం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా పశువుల మేత పోరంబోకు భూమిలో ఎలాంటి లేఅవుట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement