● దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి
చిల్లకూరు: గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశాక, తాము జిల్లాలోని ప్రజాప్రతినిధులకే గౌరవమివ్వాలనుకునేలా రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు నియోజకవర్గం ఉందనే అంశాన్ని విస్మరిస్తున్నారు. పట్టణంలో కూరగాయల మార్కెట్, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభ సందర్భంగా శిలాఫలకాల్లో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును వేయకుండానే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ విషయం బయటపడ్డాక, నెల్లూరులో విలీనం కావడంతో పార్లమెంట్ కూడా నెల్లూరే కదా అంటూ దాటవేత సమాధానమిచ్చారు. ఈ క్రమంలో చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ అధికారులు పంపారు. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఫొటోను ముద్రించి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫొటోను విస్మరించారు. అధికార పార్టీ నేతలకూ అందులో స్థానం కల్పించారు. అసలిది పార్టీ కరపత్రమా లేక దేవదాయ శాఖ ఆహ్వాన పత్రికాననే అనుమానాలు తలెత్తాయి. అధికారుల తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


