● వలస పక్షులా నీతులు చెప్పేది?
● అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం
● ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నాయకులు
ఆత్మకూరు: ‘జిల్లాలో మేకపాటి కుటుంబీకులకు మంచిపేరు ఉంది. సహాయం చేయడం తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టని నైజం వారిది. ఆనం అవినీతిపై విక్రమ్‌రెడ్డి ప్రశ్నిస్తే వలస పక్షులు, డబ్బుకు అమ్ముడుపోయిన వారు మేకపాటి కుటుంబీకులను వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు’ అని ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పట్టణంలోని విక్రమ్‌రెడ్డి కార్యాలయంలో గురువారం అన్ని మండలాల పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణాధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్‌రెడ్డి, జిల్లా బూత్ కమిటీల మేనేజర్ బాలిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పీవీ రమేష్‌రెడ్డి, పీఆర్ విభాగం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, న్యాయవిభాగం అధ్యక్షుడు నందా ఓబులేసు, మండలాల కన్వీనర్లు మాట్లాడారు. సోమశిల ఉత్తరకాలువ పనులు పూర్తికాని అంశంపై మంత్రిని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మేకపాటి కుటుంబీకులకు దాసోహంగా ఉంటున్నారు.. సిగ్గులేదా అంటూ నిందించడం దారుణమన్నారు. విక్రమ్‌రెడ్డి ఈ అవినీతిపై ప్రశ్నించారని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతే..
ఆత్మకూరులో మెయిన్ రోడ్డు పక్కనే విద్యాసంస్థకు కేటాయించిన స్థలాన్ని రూ.6 కోట్లకు కొనుగోలు చేసి చెరువు మట్టిని అక్రమంగా తరలించి చదును చేసిన విషయం, దీనిని టీడీపీ నాయకులే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో చీవాట్లు పెట్టి పనులు నిలిపివేయాలని ఆదేశించడం వాస్తవం కాదా అని నిలదీశారు. టిడ్కో ఇళ్ల సమీపంలో ప్రభుత్వ స్థలం ఉండగా అందులో మంత్రి ప్రమేయంతో వెంచర్ వేస్తున్న విషయం వాస్తవం కాదా అన్నారు. చేజర్ల మండలంలో 250 ఎకరాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని జామాయిల్ తోటను కొట్టి తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అక్రమ ఇసుక తరలింపు సమయంలో ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందగా, కనీసం ఆ కుటుంబాలను పరామర్శించే తీరిక టీడీపీ నాయకులకు లేకపోయిందన్నారు. సంగంలో స్థానిక నాయకుడు ఏఎంఆర్ సంస్థతో పాటు అధికారులను బెదిరిస్తూ తన అనుమతిలేనిదే పనులు చేయవద్దని హుకుం జారీ చేస్తున్న విషయం మంత్రి ఆనంకు తెలియదా అని అడిగారు. చికెన్ వ్యర్థాల వాహనాల వద్ద చిల్లర దండుకుంటున్న వ్యక్తి టీడీపీ నాయకుడు కాదా అన్నారు. ఆత్మకూరు చెరువు కలప రూ.10 లక్షల విలువ గల దానిని కేవలం రూ.90 వేలకే సొంతం చేసుకున్న విషయం నిజమేకదా అన్నారు.
● సుమారు రూ.200 కోట్ల ఆస్తులను దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అందజేశారన్నారు. సొంత నిధులతో పలు గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించారన్నారు. ఇలా సొంత ఆస్తులను మంత్రి ఆనం కానీ, ఆ పార్టీ చోటా టీడీపీ నేతలు ఎన్నడైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఇకనైనా స్థాయి కి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా, మండలాల కన్వీనర్లు చెన్ను వెంకటేశ్వర్లురెడ్డి, పులగం బా లశంకర్‌రెడ్డి, బిజివేముల పిచ్చిరెడ్డి, ఎంపీపీ బోయిళ్ల పద్మజారెడ్డి, రూరల్ ఎస్సీసెల్ నాయకుడు తోడేటి అశోక్, నారాయణస్వామి, కామాక్షయ్య నాయుడు, మీరామొహిద్దీన్, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం, పార్టీ నాయకులు పొంగూరు సుధాకర్, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, గుండాల బాలచంద్రారెడ్డి, ఫణికుమార్‌రెడ్డి, దాడి శ్రీనివాసులునాయుడు, మాజీ సర్పంచ్ బొలిగర్ల వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసులురెడ్డి, పాలేటి వెంగళరెడ్డి, బాల అంకయ్య, నందవరం ప్రసాద్ పాల్గొన్నారు.


