ఉద్యోగుల సమర శంఖారావం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమర శంఖారావం

Aug 21 2026 12:16 AM | Updated on Aug 21 2026 12:16 AM

ఏపీ జేఏసీ అమరావతి

జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి

నెల్లూరు(అర్బన్‌): ‘హామీలను అమలు చేయాలని ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాం. ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఈ స్థితిలో ప్రభుత్వ మంత్రుల కమిటీ చర్చించి తమకు కొంత సమయం కావాలంటే ఇచ్చాం. అయినా ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి తీర్చలేదు. ఇక సమయం ఇచ్చే ప్రసక్తే లేదు. ఉద్యమానికి సిద్ధం కండి’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణ కోసం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో శుక్రవారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి తరలిరావాలని కోరుతూ ఏపీ జేఏసీ నాయకులు గురువారం పలు డివిజన్లలో ఉద్యోగులను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమా అని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు న్యాయంగా పొందాల్సిన నగదు పొందకపోతే మూడుతరాల ఉద్యోగులు నష్టపోయినట్టేనని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు ఉందన్నారు. అవి సాధించుకునేందుకు విజయవాడలో జరుగుతున్న ఉద్యమ కార్యాచరణ సభకు తరలిరావాలని కోరారు.

ఆటో బోల్తా

ఇద్దరికి తీవ్ర గాయాలు

చిల్లకూరు: మండలంలోని కమ్మవారిపాళెం గ్రామ సమీపంలో గురువారం ఆటో బోల్తా పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గూడూరు మండలం పారిచెర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నాగయ్య తన వదిన సుభాషిణితో కలిసి చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కమ్మవారిపాళెం సమీపంలో ఆటోకు కుక్క అడ్డుగా రావడంతో దాన్ని ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుభాషి ణి కాలు విరిగింది. నాగయ్య చేతికి తీవ్ర గాయమైంది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సుభాషిణిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.

విశ్రాంత డాక్టర్‌పై

విచారణకు ఆదేశాలు

నెల్లూరు(అర్బన్‌): గతంలో సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో ఆర్థోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ సూరపతి శంకర్రావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ సెక్రటరీ వీరపాండియన్‌ గురువారం ఉత్తర్వులను ఇచ్చారు. అప్పట్లో శంకర్రావు పనిచేసేప్పుడు అనధికారికంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా విధులకు రాకుండా గైర్హాజరయ్యారు. నాటి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. శంకర్రావుపై మోపిన ఆరోపణలను విచారించేందుకు విజయనగరానికి చెందిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మజను విచారణాధికారిగా నియమించారు. ఆమె ఎదుట ప్రభుత్వం తరఫున కేసు వివరాలు సమర్పించేందుకు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల పాథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బసుమిత్రదాసును నియమించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తదుపరి క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.

ధాన్యం సేకరణకు

81 కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలో లేట్‌ రబీ 2025 – 26 ఎడగారుకు సంబంధించి పండించిన ధాన్యాన్ని సేరించేందుకు 81 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా సహకారశాఖాధికారి (డీసీఓ) గుర్రప్ప తెలిపారు. నగరంలోని డీసీఓ కార్యాలయంలో గురువారం సహకార, పీసీఎస్‌ సీఈఓ, సంఘాల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార శాఖ సిబ్బంది ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ గణాంకాల మేరకు జిల్లాలోని 1.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. 4.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పీఎసీఎస్‌ సంఘాల్లో రోజువారీ వ్యాపార లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

కండలేరులో

21.75 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 21.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్‌ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement