పనికెళ్తుండగా విషాదం | - | Sakshi
Sakshi News home page

పనికెళ్తుండగా విషాదం

Aug 21 2026 12:16 AM | Updated on Aug 21 2026 12:16 AM

ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్‌

బాలుడి మృతి

మరో ఇద్దరి పరిస్థితి విషమం

కావలి రూరల్‌: పనికోసం ముగ్గురు స్నేహితులు ఒకే బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో ఊహించని ప్రమాదం వారి ప్రయాణాన్ని విషాదంగా మార్చింది. ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కావలి – మద్దూరుపాడు మార్గంలోని డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి ముసునూరు చంద్రన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు చెందిన గంజం చందు (17), మొగిలి బబ్లూ, నాగులూరి బాబు స్నేహితులు. వీరు హైరర్స్‌, లైటింగ్‌, సెంట్రింగ్‌ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రుద్రకోటలో పని ఉండటంతో గురువారం ఉదయం ఒకే బైక్‌పై బయలుదేరారు. బైక్‌ను బబ్లూ నడుపుతున్నాడు.

డంపింగ్‌ యార్డ్‌ వద్ద..

కావలి – మద్దూరుపాడు మార్గంలోని డంపింగ్‌ యార్డ్‌ వద్ద చెత్తను తరలించి బయటకు వస్తున్న ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న ఇద్దరు రోడ్డుపక్కకు పడిపోగా తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. మరో యువకుడికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చందు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. బబ్లూ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. బాబు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కావలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు

చందు లైటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బబ్లూ బాతుల వ్యాపారం చేస్తు న్నాడు. ఇతని స్వస్థలం కందుకూరు. ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ముగ్గురూ చందు అన్న వంశీకి చెందిన బైక్‌పై రుద్రకోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కావలి వన్‌టౌన్‌ సీఐ రంగనాథ్‌గౌడ్‌, ఎస్సై సుమన్‌ ఘటనా స్థలానికి చేరు కుని ప్రమాద తీరును పరిశీలించారు. ట్రాక్టర్‌, డ్రైవర్‌ను రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement