● నెల్లూరులో ఏఐఎస్‌ఎఫ్ నేతల ర్యాలీ
నెల్లూరు(టౌన్): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి నిధుల్లో కోత విధించడం దారుణమని ఏఐఎస్‌ఎఫ్ నేతలు అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ వన్ నేషన్ – వన్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా వాటి స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తోందని విమర్శించారు. పేదవారికి విద్యను దూరం చేసేలా ప్రభుత్వాలు విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్ష పేపర్లు లీక్ అవడంతో విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. వెంటనే జీఓ నంబర్ 77ను రద్దు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారవేత్తలు చేస్తున్న దోపిడీని అరికట్టలేని పరిస్థితిలో నేటి రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల్లేరని పాఠశాలలను మూసివేయడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘మార్పురావాలి – మార్పుకావాలి’ అనే నినాదంతో ఏఐఎస్‌ఎఫ్ నిరసన కార్యక్రమాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి శివం వర్మ, నగర, రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్, అబ్దుల్ కలీం, మహిళా నాయకులు శివానీ, మాధురి, సాబీర్, అభి, కార్తీక్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.


