నెల్లూరు(అర్బన్): న్యాయమైన స్టైఫండ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద సమ్మె కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులు రోగుల కోసం రక్తదానం చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ హనీష్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లలో రెసిడెంట్ డాక్టర్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు భాగమని తెలిపారు. తాము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, తమతో సంప్రదింపులు జరపకుండానే కేవలం 5 శాతం స్టై పెండ్ పెంచుతామని ప్రకటించడం సరికాదన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు జూడాల్లో భాగం కాదని పేర్కొనడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము 30 శాతం స్టై పెండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థిక భారం అంటున్న నేపథ్యంలో 20 శాతానికి తగ్గించేందుకు సమ్మతిస్తున్నామని తెలిపారు. 2027 నుంచి ఏటా స్టై పెండ్ సవరణ చేయాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని, అయితే ప్రస్తుతం న్యాయమైన రీతిలో స్టై పెండ్ పెంచాలని కోరారు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేసిన వారితో వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన వైద్యులతోనే బోధన చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా 40 మందికి పైగా జూనియర్ డాక్టర్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో భార్గవ్, భావన, జి.సుగుణ, కీర్తి, నిర్మల్, రవి తదితరులు పాల్గొన్నారు.


