●
వింజమూరు(ఉదయగిరి): ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. దర్జాగా కబ్జా చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నా రు. ఆ తరువాత ప్లాట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి పతాక స్థాయికి చేరింది. వింజమూరు పట్టణంలో ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరగడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుని వాటిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ప్రభుత్వ స్థలాలను మింగేస్తున్నారు.
రాత్రికి రాత్రే చదును
తాజాగా వింజమూరు పట్టణ పరిధిలోని భట్టువారిపాళెం రోడ్డు మార్గంలో ఇంజినీరింగ్ కళాశాల పక్కన సర్వేనంబరు 284లోని సుమారు ఎకరా ప్రభుత్వం స్థలంపై అక్రమార్కులు కన్నేశారు. రాత్రికి రాత్రే ఆక్రమించి యంత్రాలతో చదును చేయించారు. ఆ మరుసటి రోజు చుట్టూ మొక్కలు నాటారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2011లో లేఅవుట్ ఏర్పాటు
వింజమూరులోని సర్వే నంబరు 284లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో 2001లో అప్పటి రెవెన్యూ అధికారులు పలువురు పేదలకు మూడు సెంట్ల లెక్కన నివేశన స్థలాలు మంజూరు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉండడం..కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. అధికారులు కూడా లేఅవుట్ వేసి ప్లాట్ల రూపంలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2011లో రెవెన్యూ అధికారులు సుమారు పది ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా లేఅవుట్ నిర్మించి 199 ప్లాట్లు ఏర్పాటు చేశారు. 2001లో పట్టాలు పొందిన వారితో పాటు కొత్తవారికి కూడా ప్లాట్లు కేటాయించారు. అందులో సుమారు మూడెకరాల వరకు ప్రజాప్రయోజనాల కోసం కేటాయించారు. అయితే తాజాగా అధికార పార్టీ నేతల సహకారంతో కొందరు తమకు 1998లో డీఫారం పట్టా ఇచ్చారని చెబుతూ ఎకరా భూమిని ఆక్రమించారు.
రూ.2 కోట్ల విలువైన
ప్రభుత్వ భూమి కబ్జా
2011లో పదెకరాల్లో ప్రభుత్వ
లేఅవుట్ నిర్మాణం
ప్రజావసరాల కోసం
మూడెకరాలు కేటాయింపు
అందులో ఎకరా భూమి
ఆక్రమణకు స్కెచ్
రాత్రికి రాత్రే చదును..మరుసటి రోజే
చుట్టూ మొక్కలు నాటిన అక్రమార్కులు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
రికార్డులు మాయం
ఇటీవల వింజమూరు పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్లాట్లపై అక్రమార్కుల కన్నుపడి ఆక్రమణల పర్వం ప్రారంభమైంది. నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్లాటుగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2011లో వేసిన ప్రభుత్వ లేఅవుట్‌లోని ఒరిజినల్ పట్టాదారుల జాబితా బయటపడకుండా కొందరు అక్రమార్కులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో రికార్డులను మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా లేవుట్‌లోని ప్లాట్లకు ఒరిజినల్, నకిలీ పట్టాదారులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు అమాయకులకు పట్టాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపితే అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


