పొదలకూరు : ‘ఆంజనేయస్వామి సన్నిధిలో నిలబడి స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. మా ప్రభుత్వంలో, నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన హయాంలో ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం చేయలేదు. మా నాయకులు, కార్యకర్తలు నొచ్చుకున్నా అధికారులను నిబంధనల ప్రకారమే చేయమని చెప్పానే తప్పా.. అడ్డుగోలుగా భూమలు ఆక్రమించుకోమని ఎక్కడా చెప్పలేదు. సోమిరెడ్డీ నువ్వు నిజాయతీ పరుడవైతే.. నీ హయాంలో భూముల ఆక్రమాలకు, అవినీతి, ప్రకృతి సంపద దోపిడీకి పాల్పడలేదని ప్రమాణం చేస్తావా?’ అంటూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. దైవసన్నిధిలో సోమిరెడ్డి రాజకీయాలు మాట్లాడాడు కాబట్టే నేను వాస్తవాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. పొదలకూరులోని శ్రీవీర అభయాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కాకాణి పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు పేదరికంలో ఉన్నా ఉభయదాతలు వ్యవహరించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల సోమిరెడ్డి ఆంజనేయస్వామి ఉత్సవాలకు హాజరైతే.. జనాలు రాలేదనే కడుపు మంటతో తనపై నిరాధార ఆరోపణలు చేశాడని, ఆ ఆరోపణల్లోని వాస్తవాలను వెల్లడించేందుకే మరోసారి వచ్చానన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బలు దండుకోలేదని ప్రాచీనమైన, ప్రసిద్ధ ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం సోమిరెడ్డికి ఉందా? ప్రశ్నించారు. గతంలో దేవసన్నిధిలో సోమిరెడ్డి రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయని గతంలో ఉత్సవాలకు తాను వచ్చిన సమయంలో హాజరైన జనాల్లో అదే రోజున వచ్చిన సోమిరెడ్డికు పది శాతం కూడా హాజరు కాకపోవడం వల్లనే ఆరోపణలు చేశాడని కాకాణి పేర్కొన్నారు.
భూముల వ్యవహారంలో ప్రమాణం చేయగలవా?
అంకయ్యగౌడ్ మనవడు ఇంద్రసేనగౌడ్ భూముల వ్యవహారంలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి ప్రమాణం చేయాలని కాకాణి సవాల్ విసిరారు. వారు టీడీపీలో ఉన్న సమయంలో అదే తోటల్లో ఇచ్చిన విందులకు హాజరైన సోమిరెడ్డి అప్పుడు భూములు అక్రమని చెప్పలేదన్నారు. వారికి అండగా ఉంటానని కూడా అప్పట్లో మాట్లాడినట్టు గుర్తుచేశారు. వారు వైఎస్సార్‌సీపీలో కొనసాగుతున్నందున నిత్యం ఇంద్రసేనగౌడ్ అతని తండ్రి దశరథరామయ్యగౌడ్‌పై బురద జల్లుతూ వారి భూములకు సంబంధించి తనపై నిందనలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నట్టు విమర్శించారు. తాను అధికారంలో ఉన్న సమయంలో సెంటు భూమి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కట్టబెట్టలేదన్నారు. సర్వేపల్లిని అభివృద్ధి వైపు నడిపించానని రూ.కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు వేయించినట్టు తెలి పారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని, సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతి పై తాను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కాకాణి వెంట పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, రావుల ఇంద్రసేనగౌడ్, వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌కే అంజాద్, డీ.విజయభాస్కర్‌రెడ్డి, ఆదూరు వెంకటసుబ్బయ్య, ఆకులూరు హేమంత్, దామిశెట్టి శ్రీనివాసులు, గురవయ్య తదితరులు ఉన్నారు.
ఆంజనేయ స్వామి సాక్షిగా
ప్రమాణం చేసి చెబుతున్నా..
సోమిరెడ్డీ.. నువ్వు నిజాయతీ పరుడవైతే ప్రమాణం చేస్తావా?
సర్వేపల్లిని అభివృద్ధి వైపు
నడపించింది నేనే
ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నా
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్


