చిట్టమూరు: మండల పరిధిలోని ఎల్లసిరి పాటిమిట్ట గ్రామానికి చెందిన బీజేపీ నేత కామిరెడ్డి యుగంధర్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య యుగంధర్‌రెడ్డికి పార్టీ కుండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు పోచారెడ్డి సుకుమార్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చింతంరెడ్డి ప్రసాద్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం
నెల్లూరురూరల్: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఆర్.సుభాషిణి రూ.20 లక్షల విరాళాన్ని అందించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్మన్ హిమాన్షు శుక్లాకు చెక్కును అందజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు సుభాషిణి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
టీచర్ ఆత్మహత్య
గూడూరు: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ ఆరోగ్య సమస్యలతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. బజారువీధిలో టీచర్ యల్లంరాజు విజయమ్మ (51) నివాసముంటోంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమార్తె పాండేటి శ్రావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
పేకాట కేంద్రంపై
పోలీసుల దాడులు
● రూ.1.38 లక్షల నగదు స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేసి 11 మంది జూదరులను అరెస్ట్ చేసి రూ.1,38,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తెలుగుగంగ కార్యాలయం సమీపంలోని ఓ కారు వాష్ వెనుక భాగంలో సోమవారం కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నెల్లూరు నగరం, రూరల్ మండలానికి చెందిన ఎన్.చంద్రబాబు, సీహెచ్ మోహన్‌రెడ్డి, కె.మురళీకృష్ణ, డి.జనార్దన్, కె.నాగేంద్రరావు, నరహరి, కె.ప్రసాద్‌రెడ్డి, బి.శ్రీనివాసులు, పి.వెంకటరమణయ్య, ఎస్.వెంకటేశ్వర్లు, కొడవలూరు మండలానికి చెందిన ఎస్.నవీన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, 11 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
రైలు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఖాకీ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బ్లూ, నలుపు రంగుల గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు, 92475 75628 సెల్ నంబర్‌కు తెలియజేయాలని ఎస్సై కోరారు.


