● సీపీఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన,
కలెక్టరేట్ వద్ద ధర్నా
నెల్లూరురూరల్: నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకులు విమర్శించారు. ఆ పార్టీ నేతలు సోమవారం వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ చేపట్టిన పాదయాత్రల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి జంగాల అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో పేదలపై ఆర్థిక భారం పెరుగుతుండగా, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇదేనా వికసిత్ భారత్ అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందేలా ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, రుణాలు అందించాలని కోరారు. మహిళలపై హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని, దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిని పునరుద్ధరించాలని కోరారు.
● సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ పాదయాత్రల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నేతలు దామా అంకయ్య, కె.వినోదిని, వి.రామరాజు, నందిపోగు రమణయ్య, సిరాజ్, చిన్న అంకయ్య, షాన్వాజ్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.


