నెల్లూరు(పొగతోట): అతని కాళ్లు, చేతులు కదలవు.. తన అవసరాలు చెప్పుకోలేడు.. ఆకలేస్తే అన్నం కావాలని, దాహమేస్తే మంచినీళ్లు కావాలని అడగలేడు. పురుగులు, దోమలు కుట్టినా.. ఈగలు వాలినా వాటిని చేతులతో తోలుకోలేడు. 22 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ స్థితిలో ఉన్న కొడుకు ఆలనాపాలనను తల్లి చూసుకుంటూనే పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు కలెక్టర్‌ను ఆశ్రయించింది.
వరికుంటపాడు మండలం కనీయంపాడు గ్రామానికి చెందిన నారయ్య, నవమ్మ దంపతులది పేద కుటుంబం. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు చేవూరి రవి (32) పదేళ్ల వయసు వరకు అందరి పిల్లల్లాగే చురుగ్గానే ఉండేవాడు. ఆ తర్వాత అనారోగ్యంతో కాళ్లు, చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. రవి తన అవసరాలను తానే తీర్చుకోలేని పరిస్థితి. రోజూ భోజనం తినిపించడం, మంచినీరు అందించడం నుంచి అన్ని పనులూ తల్లే చేయాలి.
రెండేళ్లుగా పింఛన్ కోసం..
ప్రస్తుతం రవికి దివ్యాంగుల పింఛన్ వస్తోంది. అయితే మంచానికే పరిమితమైన అతడికి డీఎంహెచ్‌ఓ పింఛన్ మంజూరు చేయించాలని తల్లి రెండేళ్లుగా సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదు. భర్త నారయ్య వృద్ధుడు. చిన్న కుమారుడు పదో తరగతి వరకు చదువుకుని బేల్దారి పనులకు వెళ్తుంటాడు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో రవి పింఛన్ తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని తల్లి చెబుతోంది.
కలెక్టర్‌కు మొర..
ఎన్నిసార్లు అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాను నవమ్మ కలిసి వినతిపత్రం సమర్పించింది. మంచానికే పరిమితమైన రవిని కార్యాలయానికి తీసుకురాలేని తన పరిస్థితిని వివరించింది. అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం డీఎంహెచ్‌ఓ పింఛన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
22 ఏళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడు
డీఎంహెచ్‌ఓ పింఛన్ కోసం తిప్పలు
దివ్యాంగుల పింఛన్ వస్తుంది కదా
అంటున్న అధికారులు
రెండేళ్లుగా అధికారుల చుట్టూ
తిరుగుతున్న తల్లి


