● భూకబ్జాదారులకు
అధికార పార్టీ నేతల అండ
● దళిత సంఘర్షణ సమితి జిల్లా
అధ్యక్షుడు మల్లి
కావలి: మండలంలోని రుద్రకోటలో జాతీయ రహదారి సమీపాన రూ.కోట్ల విలువ చేసే 21 ఎకరాల భూమిని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి ఆరోపించారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని మండిపడ్డారు. పేదల శ్మశాన స్థలాన్ని కూడా వదలకుండా రెవెన్యూ అధికారులు డబ్బుకు అమ్ముడుపోయి చేసిన ఈ నిర్వాహకాన్ని ఎండగడుతూ ఆ గ్రామ దళితులతో కలిసి సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికార పార్టీ నేతలు చర్యల్ని ఖండించారు. అనంతరం ఆర్డీఓ ఎలీషాకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్వే నంబర్ 600లో పులుసు గోపీకి 4.94 ఎకరాలు, పులుసు ప్రసాద్‌కు సర్వే నంబర్ 599లో 4.56 ఎకరాలు, పుట్టా సునీతకు 599–1లో 4.56 ఎకరాలు, పులుసు రాజేశ్వరికి 5 ఎకరాలు గతంలో అధికారులు అమ్ముడుపోయి కట్టబెట్టారని వివరించారు. దళితవాడ శ్మశాన స్థలానికి కూడా పట్టా మంజూరు చేశారని, న్యాయం చేస్తామన్న అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నేటికి ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని వివరించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.


