● పీజీఆర్‌ఎస్‌లో ఆవేదన
● 162 వినతుల అందజేత
నెల్లూరు(క్రైమ్): ‘నా చిన్నకుమారుడు ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్నాడు. నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. విచారించి న్యాయం చేయండి’ అని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా విచారించి సమస్యను పరిష్కరిండని పలువురు బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 162 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వినతులు పునరావృత్తం కాకుండా చూడాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్, పీసీఆర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా భర్త చనిపోయాడు. ఉద్దీపగుంట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెడు ఉద్దేశంతో నా వెంటబడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు.
● కందుకూరుకు చెందిన జీవన్ కుమార్, ప్రసాద్ ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. యాప్‌లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయని నమ్మించారు. నాచేత రూ.2.50లక్షలు పెట్టించి మోసగించారని గూడూరు గాంఽధీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● నెల్లూరుకు చెందిన నవీన్‌కుమార్ అతని స్నేహితుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.50 లక్షలు తీసుకున్నారు. ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్ పంపి మోసగించారని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.


