● గొంతుపై గాయాలు
● హత్య కోణంలో పోలీసుల విచారణ
కోట: మండల పరిధిలోని లక్ష్మక్కకండ్రిగ అరుంధతీయవాడలో శనివారం పల్లాల కోటయ్య (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తెల్లవారుజామున భర్త ఇంట్లో మృతిచెందినట్లు భార్య మంజుల బంధువులకు సమాచారమిచ్చింది. వీధిలో ఓ ఫంక్షన్ ఉండడంతో అక్కడ రాత్రి మద్యం ఎక్కువ సేవించాడని, నిద్రలోనే మృతిచెందినట్లు ఆమె తెలిపింది. అయితే సమయం గడిచే కొద్ది భార్య ప్రవర్తనపై బంధువులకు అనుమానం వచ్చింది. గొంతు వరకు గుడ్డకప్పి ఉంచడం, ఆమె రోధిస్తున్న తీరుపై వారికి అనుమానం కలగడంతో గుడ్డను తొలగించి మృతదేహాన్ని పరిశీలించగా గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు సీఐ శేఖర్‌బాబు, ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వైరు లేదా తాడు గొంతుకు బిగించి హత్య చేసినట్లు అనుమానం కలగడంతో అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలంలో క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించింది.
దారుణంగా హత్య చేశారు
కోటయ్యను భార్య మంజుల, ఆమె ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుడు కోటయ్యపై దాడికి కూడా పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. ఇద్దరిని విచారించి అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు. మృతుని మామ వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు.


