● రూ.5 లక్షల ఆస్తి నష్టం
ఆత్మకూరురూరల్: మండలంలోని కరటంపాడు గ్రామ శివారులో శనివారం సుమారు ఎనిమిది ఎకరాల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. కరటంపాడు డీసీపల్లి మధ్య పడమర వైపున ఉన్న పొలాల్లోని ఎండు గడ్డికి మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలిసింది. ఆ సమయంలో బలంగా తూర్పు గాలులు వీయడంతో సమీపంలోని జామాయిల్ తోటకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు వ్యాపించి తోట దగ్ధమైంది. డీసీపల్లి టోల్‌గేట్ సిబ్బంది వెంటనే మర్రిపాడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఎనిమిది ఎకరాల్లోని జామాయిల్ చెట్లు కాలిపోయి దాదాపు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు సుబ్బరత్నమ్మ తెలిపారు.


