సగర్వం.. త్రివర్ణ వైభవం | - | Sakshi
Sakshi News home page

సగర్వం.. త్రివర్ణ వైభవం

Aug 16 2026 12:45 AM | Updated on Aug 16 2026 12:45 AM

ఊరూరా మువ్వన్నెల జెండాల సంబరం

స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ

రెపరెపలాడిన జాతీయ పతకాలు

అంబరాన్నంటిన

80వ పంద్రాగస్టు వేడుకలు

విశిష్ట సేవలందించిన 521 మందికి

అవార్డుల ప్రదానం

జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: మంత్రి నారాయణ

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు.. స్వేచ్ఛా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి.. ఎనిమిది దశాబ్దాల భారతావని జాతీయతా భావం.. ఇవన్నీ మువ్వన్నెల జెండాలో మిళితమై పంద్రాగస్టు వేడుకల్లో ప్రతిబింబించాయి. ఊరూరా ఆకాశ వీధుల్లో మువ్వన్నెల వీచికలు.. భరత ఖండం గర్వ ధ్వజమై రెపరెపలాడగా.. స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. త్రివర్ణ తరంగం.. తరం తరం గౌరవానికి ప్రతీకగా, వీధివీధిన అలరారగా, పట్టణం నుంచి పల్లె వరకు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో దేశభక్తి గర్వగీతమై ఉప్పొంగింది. సగర్వంగా ఎగిరిన త్రివర్ణ పతాకం.. దేశభక్తి, త్యాగం, సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. అంబరాన్నంటిన సంబరాల నడుమ జాతీయ పతాకానికి ఘన వందనం సమర్పించారు. విశిష్ట సేవలందించిన 521 మందికి అవార్డులు ప్రదానం చేస్తూ.. ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

జాతీయ పతాకానికి వందనం చేస్తున్న మంత్రి నారాయణ, చిత్రంలో కలెక్టర్‌ హిమన్షు శుక్లా, ఎస్పీ అజిత, ఏఎస్పీ సౌజన్య, డీఆర్వో విజయకుమార్‌

నెల్లూరు (అర్బన్‌): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ.. 80వ పంద్రాగస్టు వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధ్యక్షతన ఎస్పీ అజిత వేజెండ్ల నేతృత్వంలో ఘనంగా జరిగాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎటుచూసినా త్రివర్ణ పతాకాలే దర్శనమిచ్చాయి. ఆకాశ వీధుల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు.. స్వేచ్ఛా భారత స్ఫూర్తిని చాటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లు జాతీయ పతాకాలతో కళకళలాడగా.. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి భావనతో ఉప్పొంగారు. జాతీయ పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో పంద్రాగస్టు సంబరం అంబరాన్నంటింది. ప్రధాన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 521 మందిని సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

పారదర్శకతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. పీ–4 విధానం ద్వారా జిల్లాలో 41,875 బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకుని ప్రభుత్వ–ప్రైవేట్‌, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి పెద్ద పీట వేస్తూ రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇఫ్‌కో సెజ్‌ను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కోల్డ్‌చైన్‌, గోదాములు, ఎగుమతుల కేంద్రంగా రూ. 30 వేల కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. తద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కృష్ణపట్నం పోర్టు ఆధారంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ చైన్నె–బెంగళూరు కారిడార్‌లో భాగంగా 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నా రు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అనే మూడు లక్ష్యాలతో జిల్లాను రాష్ట్రంలోనే పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నామన్నారు.

సంక్షేమానికి పెద్ద పీట

జిల్లాలో సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. సీ్త్ర శక్తి, దివ్యాంగ శక్తి పథకాల ద్వారా మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఆటోడ్రైవర్లకు రూ 15 వేలు, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు వంతున ప్రతి సంవత్సరం సాయమందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ భరోసా ద్వారా 2.86 లక్షల మందికి ప్రతి నెలా రూ.126 కోట్లను ఇంటి పద్దనే పెన్షన్‌ రూపంలో అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.90 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ 378.79 కోట్లను జమ చేశామన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 4,172 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున రూ.10.43 కోట్లు అందించామన్నారు. దగదర్తిలో రాష్ట్రంలోని 8వ విమానాశ్రయంగా గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రజాప్రతినిధులు డుమ్మా

స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపుతూ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులు పంద్రాగస్టు వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రజా ప్రతినిధులకు కేటాయించిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మాత్రం ముందు నుంచి వచ్చి కూర్చున్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చినప్పటికీ ఆయన కాసేపు ఉండి వెళ్లిపోయారు. మిగతా వారు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలి

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి, జిల్లా జడ్జి

కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ మన్మధరావు

నెల్లూరు (లీగల్‌): దేశం పట్ల గౌరవాన్ని, ఐక్యతను చాటుతూ దేశభక్తితో ఉండాలని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ మన్మధరావు సూచించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ మన్మధరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్‌ పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం శ్రీనివాస్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, న్యాయశాఖ ఉద్యో గులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్త శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన న్యాయవాదులను, న్యాయశాఖ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు కోర్టుల న్యాయమూర్తులు, జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్‌ జి.రవిశంకర్‌, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ నారాయణ రెడ్డి, వెంకటసునీల్‌, న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ మన్మధరావుకు న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు.

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి జాతీయ జెండా ఎగురా వేశారు. ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్‌, సహాయ కార్యదర్శి కేఎల్‌ నారాయణ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement