● వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర
దినోత్సవ వేడుకలు
నెల్లూరురూరల్: నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కాకాణి, పర్వతరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాణి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఈ రోజు కూటమి పాలనలో ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, విమర్శించే వారి గొంతు నొక్కుతున్నారని, చట్టాలను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేస్తూ భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు పడ్డాయన్నారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో గ్రామ స్థాయిలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి పాలనలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రాజకీయ, సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
రెడ్‌బుక్ పాలనకు చరమగీతం
పాడాలి: పర్వతరెడ్డి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘రెడ్‌బుక్ పాలన’ కారణంగా ప్రజలు స్వాతంత్య్రానికి పూర్వం నాటి చీకటి రోజులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులు బ్రిటిష్ పాలన కంటే దారుణంగా మారాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చీకటి పాలన తొలగిపోయి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందన్నారు. పాలకుల ధోరణిలో మార్పు రావాలని, స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని కోరారు.


